కరోనాను కట్టడి చేసేందుకు గాను భారతదేశంలో 21 రోజుల లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో జనం ఇల్లు విడిచి బయటకు రావడం లేదు. ఎంతో బిజీగా ఉండే వారు సైతం ఈ సమయంలో కుటుంబసభ్యులతో ఏంజాయ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు ప్రజలను ఇళ్లలోనే ఉండాలని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే కరోనా దెబ్బకు ఇళ్లలో పనిచేసే సిబ్బంది రాకపోవడంతో పలువురు వారి పని వారే చేసుకుంటున్నారు.

Also Read:అమెరికాలో చిక్కుకుపోయా.. కాపాడండి.. హాకీ ప్లేయర్ అశోక్

ఇళ్లు శుభ్రం చేసుకోవడం, బట్టలు ఉతకడం, వంట పని ఇలాంటివన్నీ మన క్రికెటర్లే చేసుకుంటున్నారు. ఇప్పటికే శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, బుమ్రా, రోహిత్ శర్మ‌లు ఇంటి పనులు చేసుకుంటున్న వీడియోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఏం చేస్తున్నాడో మాత్రం బయటకు రాలేదు. ఐపీఎల్ వాయిదా పడటం, చెన్నై టీమ్ ప్రాక్టీస్ సెషన్ రద్దు కావడంతో ధోని కనిపించకుండా పోయాడు.

ఈ క్రమంలో ధోని లాక్‌డౌన్ సమయంలో ఏం చేస్తున్నాడో అతని భార్య సాక్షి సింగ్ అభిమానులతో పంచుకున్నారు. ఈ మిస్టర్ కూల్ కూడా మిగిలిన క్రికెటర్లలాగే ఇంటి పనులు చేసుకుంటున్నాడు.

Also Read:లాక్ డౌన్ లో శునకంతో... ఆసిస్ క్రికెటర్ ఆట

తన గార్డెన్‌లో పెరిగిన గడ్డిని, చెట్ల కొమ్మలను కత్తిరిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. దానిని చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేసింది.

దీనిపై నెటిజన్లు, అభిమానులు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. నీకు కూడా ఇంట్లో పనులు తప్పలేదా అని ఒకరు... క్రికెట్ స్టారైనా బాధలు తప్పవని ఇంకొకరు సరదాగా కామెంట్లు పెట్టారు.