మహేంద్ర సింగ్ ధోని... ఈ పేరు కొద్దిరోజులుగా బాగా వార్తల్లో నిలుస్తోంది. ప్రపంచ కప్ తర్వాత అది మరీ ఎక్కువయ్యింది. ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అతడు వరల్డ్ కప్ తర్వాత అన్ని పార్మాట్లకు రిటైర్ కానున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ధోని నుండి అలాంటి ప్రకటన కాకుండా ఓ కొత్త ప్రకటన వెలువడింది. దేశ రక్షణ కోసం సైనిక విధుల్లో చేరనున్నట్లు ప్రకటించడంతో రిటైర్మెంట్ పై జరుగుతున్న ప్రచారం ఆగిపోయింది. అయితే తాజాగా ధోని సైనిక విధులు ముగియడంతో మరోసారి రిటైర్మెంట్ పై చర్చ మొదలయ్యింది. 

టీమిండియా క్రికెటర్ ధోని ఇండియన్ ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ హోదాలో కొనసాగుతున్నాడు. పారాచ్యూట్ రెజిమెంట్ కు చెందిన ఇతడు గత రెండు వారాలుగా కశ్మీర్ లోయలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల కొత్తగా ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ లో తోటి సైనికులతో కలిసి ధోని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాడు. ఈ కార్యక్రమంతో ధోని సైనిక విధులు ముగిశాయి. దీంతో అతడు ఇంటికి పయనమయ్యాడు. 

ఇలా ఇన్ని రోజులూ ధోని ఇండియన్ ఆర్మీలో కొనసాగాడు కాబట్టి అతడి దేశభక్తి గురించి చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఆ చర్య మళ్లీ అతడి రిటైర్మెంట్ వైపు మళ్లింది. సైన్యానికి సేవలందించేందుకు ధోని వెస్టిండిస్ సీరిస్ నుండి స్వయంగా తప్పుకున్నాడు. అయితే మరికొద్దిరోజులు వెస్టిండిస్ పర్యటన ముగించుకుని టీమిండియా స్వదేశానికి రానుంది. సెప్టెంబర్ 15 నుండి దక్షిణాఫ్రికాతో టీ20 సీరిస్ జరగనుంది. ఇందులో ధోని ఆడతాడా...? లేక అంతకంటే ముందే రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అన్న అనుమానాలు అభిమానులకు మొదలయ్యాయి. 

వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్ లో ధోనిని ఆడించాలనుకుంటే తప్పకుండా దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సీరిస్ కు ఎంపికచేస్తారు. అలాకాకుండా ఈ సీరిస్ కు ధోనిని ఎంపిక చేయలేదంటే అతడి రిటైర్మెంట్ ఖాయమైనట్లేనని అనుకోవచ్చు. ఒకవేళ సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేస్తే ప్రపంచ కప్ లో ఆడించాలనే ఉద్దేశ్యం వారికున్నట్లు స్పష్టమవుతుంది. ఇదే జరిగితే 2021 వరకు ధోని రిటైర్మెంట్ ప్రకటన వుండే అవకాశాలు లేవన్నమాటే.