హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ హనుమ విహారీ తెలంగాణ ఐటి, మున్సిపల్ శాఖల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును కలిశారు. సోమవారంనాడు ఆయన కేటీఆర్ ను కలిశారు. సిడ్నీలో జరిగిన మూడో టెస్టు మ్యాచులో అశ్విన్ తో కలిసి హనుమ విహారీ కీలకమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ ను ఓటమి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. మ్యాచ్ డ్రా కావడానికి అతను కడదాకా నిలిచాడు. 

హనుమ విహారీ ప్రదర్శనపై తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఇంతకు ముందే ప్రత్యేకంగా ప్రశంసల జల్లు కురిపించారు. అయితే, తొడ కండరాల గాయం కారణంగా విహారి చివరి టెస్టు మ్యాచుకు దూరమయ్యాడు. దాంతో ఇటీవల స్వదేశానికి తిరిగి వచ్చాడు. 

ఆ క్రమంలో ఆయన సోమవారంనాడు కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఆస్ట్రేలియాలో చిరస్మరణీయమైన ప్రదర్శన చేసిన విహారిని కేటీఆర్ శాలువాతో సత్కరించారు. ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించిన వివరాలను విహారీ కేటీఆర్ కు వివరించారు. 

కేటీఆర్ ను కలవడం, ఇరువురి మధ్య క్రికెట్ గురించి ఆసక్తికరమైన చర్చ జరగడం ఆనందంగా ఉందని విహారి అన్నాడు. ఆ తర్ావత కేటీఆర్ తో దిగిన ఫొటోలను విహారి ట్విట్టర్ లో షేర్ చేశాడు.