టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మధ్య గతంలో జరిగిన కోల్డ్ వార్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుత టీమిండియా చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ స్పందించారు. 

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించి టీమిండియా చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ షాకింగ్ విషయాలు వెల్లడించారు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు జరిగిన విలేకరుల సమావేశాంలో తనను వన్డే కెప్టెన్‌గా తొలగించినట్లుగా ముందస్తు సమాచారం ఇవ్వలేదని కోహ్లీ అబద్ధం చెప్పాడని చేతన్ శర్మ ఆరోపించారు. భారత జట్టు దక్షిణాఫ్రికాకు బయల్దేరే ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ.. తనను వన్డే కెప్టెన్‌గా తొలగించే నిర్ణయం గురించి తనకు తెలియజేసినట్లుగా అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చేసిన వాదనను ఖండించాడు. దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కోసం జట్టు ఎంపిక సమావేశానికి గంటన్నర ముందుగా శర్మ ద్వారా ఫోన్‌లో తనకు చెప్పినట్లు కోహ్లీ పేర్కొన్నాడు. 

జీ న్యూస్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో.. గంగూలీ, బీసీసీఐలను ఉద్దేశించి కోహ్లీ అబద్ధం చెప్పాడని చేతన్ శర్మ పేర్కొన్నారు. కోహ్లీ అసలు ఆ టాపిక్ తీసుకురావాల్సిన అవసరం లేదని, కానీ అబద్ధం ఎందుకు చెప్పాడో తనకు తెలియదని అన్నారు. అయితే విరాట్ ఎందుకు అబద్ధం చెప్పాడో నేటికీ ఎవరికీ తెలియదని.. ఇది ఆయన వ్యక్తిగత విషయమని చేతన్ శర్మ పేర్కొన్నారు. బీసీసీఐ బలాన్ని బహిరంగంగా సవాల్ చేసిన తర్వాత కోహ్లీ టెస్ట్ కెప్టెన్‌గా నిష్క్రమించడంలో ఆశ్చర్యం లేదు. అలాగే భారత్ సైతం దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. 

కోహ్లీ -గంగూలీ పోరు గురించి మరింత వివరిస్తూ.. అప్పటి బీసీసీఐ చీఫ్ కారణంగా తాను కెప్టెన్సీ కోల్పోయినట్లు కోహ్లీ భావించాడని శర్మ పేర్కొన్నాడు. విలేకరుల సమావేశంలో కోహ్లీ.. తిరిగి కెప్టెన్సీని పొందాలనుకున్నట్లు అనిపించిందన్నారు. యాదృచ్ఛికంగా గంగూలీని గతేడాది బీసీసీఐ చీఫ్‌గా తొలగించారు. ఆయన స్థానంలో భారత మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీని నియమించారు.