యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఐపిఎల్ లో రాణించినట్లుగా అంతర్జాతీయ క్రికెట్లో ఆకట్టుకోలేకపోతున్నాడు. లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని స్థానంలో జట్టులోకి వచ్చిన అతడు ఆశించిన స్థాయిలో ఆడటంలో విఫలమవుతున్నాడు. వికెట్ కీపింగ్ లోనే కాదు బ్యాటింగ్ లోనూ అతడు వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. దీంతో పంత్ ని భారత జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేసిన అభిమానులే ప్రస్తుతం అతన్ని పక్కనపెట్టాలని కోరుతున్నారు. అలాగే కొందరు మాజీ క్రికెటర్లయితే పంత్ పై తీవ్ర విమర్శలకు దిగుతున్నారు.

గంభీర్ వంటి మాజీలయితే మరో అడుగు ముందుకేసి టీమిండియా మేనేజ్‌మెంట్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వారే పంత్ ను కాపాడుతున్నారని... ఇతర ఆటగాళ్లలా కాకుండా పంత్ ను స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నారని అన్నాడు. అతడిపై ప్రేమతో మిగతా ఆటగాళ్లకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించాడు. ఇలా పంత్ పైనే కాకుండా తమపై వస్తున్న విమర్శలను తాజాగా టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి తిప్పికొట్టారు.

 ''రిషబ్ పంత్ ను ఎప్పుడు ఆడించాలో... ఎప్పుడు పక్కనపెట్టాలో మాకు తెలుసు. అయినా ఎవరో చెబితే అతన్ని జట్టులోకి తీసుకోలేదు. ఫస్ట్ క్లాస్, ఐపిఎల్ ప్రదర్శన ఆదారంగానే పంత్ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం అతడు మెరుగ్గా ఆడలేకపోతున్నాడు. 

ఇలాంటి ఆటగాళ్ల ఇబ్బందులను దూరం చేసి మెరుగైన ఆటను బయటకు తీయడానికి నేనున్నది. కాబట్టి పంత్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నా. అతడు బ్యాడ్ షాట్ సెలెక్షన్ కారణంగానే ప్రతిసారీ ఔటవుతున్నాడు. అతడిచేత అలాంటి షాట్లు ఆడకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఇలా ఆటగాళ్ల ఆటతీరును పరిశీలించడం, లోపాలుంటే సరిదిద్దడానికే కోచ్ గా నేనిక్కడున్నది. తబలా వాయించడానికి కాదు. 

నిజంగా చెప్పాలంటే పంత్ అపార ప్రతిభ కలిగిన ఆటగాడు. నేటితరం వరల్డ్ క్లాస్ క్రికెటర్లలో అతడొకడు.  ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే సత్తా వున్న ఆటగాడు. కానీ ప్రస్తుతం అతడి టైం బాగాలేక విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అతడికి మరికొన్ని అవకాశాలిస్తే అతడు తప్పకుండా రాణించగలడు. ప్రతిభ గల ఆటగాళ్లను ప్రోత్సహించకున్నా పరవాలేదు...కాని ఇలా నిరూత్సాహర్చడం మంచిదికాదు. 
 
ఆటగాళ్లకు అండగా వుండటమే మేనేజ్‌మెంట్ పని. ఆ విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్ సమర్థవంతంగా పనిచేస్తోంది. వారిని ఏమాత్రం తప్పుబట్టాల్సిన పనిలేదు.'' అంటూ పంత్ ను విమర్శిస్తున్న వారికి రవిశాస్త్రి కాస్త ఘాటుగా జవాభిచ్చాడు.