టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య కోల్డ్ వార్ సాగుతున్నట్లు ఓ ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతవరకు నిజముందో తెలీదుగానీ  ఓ విషయంలో మాత్రం వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వీరిద్దరూ పరుగుల దాహంతో చెలరేగుతూ పోటాపోటీగా సెంచరీలు సాధిస్తున్నారు. ఇలా ఈ  ఏడాది ఇప్పటివరకు అత్యధిక శతకాలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో వీరిద్దరు మొదటి రెండు స్థానాలను ఆక్రమించారు. ఆరు సెంచరీలో రోహిత్ మొదటి స్థానంలో నిలవగా కోహ్లీ 5 సెంచరీలతో రెండో స్ధానానికి పరిమితమయ్యాడు. 

ఇటీవలే ముగిసిన వెస్టిండిస్ వన్డే సీరిస్ లో విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. వరుసగా రెండు మ్యాచుల్లో రెండు సెంచరీలు బాది టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఈ రెండు సెంచరీలను కలుపుకుంటే ఈ ఏడాదిలో ఇప్పటివరకు అతడు సాధించిన సెంచరీల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఓ సెంచరీ, ఆ జట్టు ఇండియా పర్యటనలో మరో 2 సెంచరీలు సాధించాడు. ఇలా కోహ్లీ ఖాతాలో మొత్తం ఐదు సెంచరీలు చేరాయి. 

ఇక రోహిత్ విషయానికి వస్తే ఐసిసి ప్రపంచ కప్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు ఏకంగా ఐదు సెంచరీలు సాధించాడు. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా ఇతడు ఓ సెంచరీ సాధించాడు. ఇలా ఈ ఏడాది ఇప్పటివరకు రోహిత్ ఆరు సెంచరీలు సాధించి రోహిత్ పై పైచేయి సాధించాడు.
 
ఇకపోతే ఈ  ఏడాదిలో మిగిలిన నాలుగు నెలల్లో టీమిండియా నాలుగు వన్డే  సీరిస్ లు ఆడనుంది. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండిస్ జట్లతో భారత జట్టు వరుసగా తలపడనుంది. వీటిల్లో కోహ్లీ, రోహిత్ లలో ఎవరు అద్భుతంగా ఆడితే వారే ఈ ఏడాది అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లుగా నిలవనున్నారు.