కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే కెప్టెన్, బ్యాట్స్‌మెన్ గా వివిధ పాత్రలు పోషిస్తూ టీమిండియా గెలుపులో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అయితే తనకిష్టమైన దిగ్గజ క్రికెటర్ తో ఎక్కువ సమయం ముచ్చటించేందుకు మరో కొత్త అవతారమెత్తాడు. ఇప్పటికే టీ20, వన్డే సీరిస్ ముగియడంతో టెస్ట్ సీరిస్ కోసం ఆంటిగ్వాకు చేరుకున్న కోహ్లీ స్థానికుడైన మాజీ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ ను కలుసుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ యాంకర్ అవతారమెత్తాడు. 
 
వివ్ రిచర్డ్స్ ను కోహ్లీ ఇంటర్వ్యూ చేస్తున్న వీడియోలోని కొంత భాగాన్ని టీజర్ మాదిరిగా బిసిసిఐ విడుదలచేసింది. అధికారిక ట్విట్టర్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ''ఇది విరాట్ కోహ్లీ, వివ్ రిచర్స్ మధ్య జరిగిన సంభాషణ. కింగ్ కోహ్లీ యాంకర్ గా మారి కరీబియన్ మాస్టర్ క్రీడా జీవితం గురించి ప్రశ్నించాడు. భయం అనేదే ఎరుగని అతడి  ఆటతీరుకు సంబంధించిన విషయాలపై చర్చించాడు. '' అన్న క్యాప్షన్ తో ఈ వీడియోను  పోస్ట్ చేసింది. 

ఈ సందర్భంగా కోహ్లీ అడిగిన పలు ప్రశ్నలకు రిచర్డ్స్ ఆసక్తికరమైన జవాబులు  చెప్పాడు. అత్యంత నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోన్న సమయంలోనూ తాను హెల్మెట్ ధరించేవాడిని కాదని రిచర్డ్స్ గుర్తుచేశాడు. ఆ సమయంలో వేగంగా మీదకు దూసుకువచ్చే బౌన్సర్లను చూసి భయం వేయకపోగా తగిలితేనే మంచిదని  భావించేవాడిని. అలాగయితేనే ప్రతిసారి వాటికి భయపడకుండా వుండవచ్చన్నది తన ఆలోచనగా తెలిపాడు. ఇలా ది కింగ్ ఆఫ్ ఆంటిగ్వా వివియన్ రిచర్డ్స్ పలు ఆసక్తికరమైన విషయాలను కోహ్లీ జరిపిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.