భారత్-సౌతాఫ్రికాల మధ్య టీ20 సీరిస్ కు సర్వం సిద్దమైంది. ఇవాళ(ఆదివారం) ధర్మశాల వేదికన జరగనున్న మొదటి టీ20 ద్వారా ఈ  సీరిస్ ఆరంభంకానుంది. ఇప్పటికే వెస్టిండిస్ ను వారి స్వదేశంలోనే చిత్తుచిత్తుగా ఓడించిన కోహ్లీసేన భారత గడ్డపై సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం సౌతాఫ్రికాపై తమ అత్యుత్తమ ప్రదర్శనను బయటపెట్టి జట్టును  గెలిపించుకోడానికి ఆటగాళ్లంతా సిద్దంగా వున్నారని టీమిండియా కెప్టెన్ విరాట్ తెలిపారు. 

టీ20 సీరిస్ మరికొద్దిగంటల్లో ఆరంభమవనున్న నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడారు. '' హోం టీమ్ అయిన మేము పక్కా గేమ్ ప్లాన్ తో బరిలోకి దిగుతున్నాం. కేవలం విజయమే లక్ష్యంగా ముందస్తుగా రచించుకున్న ప్రణాళికల  ప్రకారమే మా ఆట వుంటుంది. 

విదేశీ పర్యటనల కోసం ఎంత జాగ్రత్తగా వుంటామో ఈ సీరిస్ కోసం కూడా అంతే నిబద్దతతో కష్టపడుతున్నాం. విదేశీ మైదానాల్లో రాణించడానికి సమిష్టిగా, వ్యక్తిగతంగా ముందస్తు   వ్యూహాలతో బరిలోకి దిగుతామో ఇప్పుడు కూడా అలాగే సిద్దమయ్యాం. అలా  అయితేనే విజయం సాధించగలం.

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో చాలా మార్పులు వచ్చాయి. స్వేచ్చగా ఆడగలగడమే అత్యుత్తమ ఆటగాడికి కావాల్సింది. అప్పుడే  విదేశమా, స్వదేశమా  అన్న తేడా వుండదని రవి భాయ్ (చీఫ్ కోచ్ రవిశాస్త్రి) ఎప్పుడూ  చెబుతుంటారు...  అదే మైండ్ సెట్ తో ఈ  సఫారీలను ఎదుర్కొనేందుకు బరిలోకి దిగుతున్నాం. 

గత రెండు మూడేళ్లుగా సౌతాఫ్రికా చాలా నిలకడగా ఆడుతోంది. అందువల్లే స్వదేశంలో ఆడుతున్నామన్నది మరిచి ప్రతి ఒక్కరం అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తాం. మైదానం, ఫార్మాట్ ఏదైనా గెలుపు లక్ష్యంగా మా ప్రయత్నం వుంటుంది.'' అని కోహ్లీ పేర్కొన్నాడు.