టీమిండియా యువ క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, హనుమ విహారీలపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలు వర్షం కురిపించాడు. బుమ్రా ప్రస్తుతం పరిపూర్ణ బౌలరని.. తన స్వింగ్, పేస్, వైవిధ్యంతో అతను తికమకపెడతాడని అభిప్రాయపడ్డాడు. క్రమశిక్షణ, పనితీరుతో తన జీవితాన్ని మలుచుకున్నాడని.. ఆ విధంగా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడని కోహ్లీ కొనియాడాడు.

బుమ్రా భారత జట్టులో ఉండటం మా అదృష్టమని.. అతడు జోరుమీదుంటే తొలి 5-6 ఓవర్లలోనే కొత్త బంతితో పని పూర్తి చేస్తాడని..  తొలి ఇన్నింగ్స్‌లో వేసిన స్పెల్ కన్నా భయంకరమైన బౌలింగ్ గతంలో ఎన్నడు చూడలేదని విరాట్ స్పష్టం చేశాడు. మరోవైపు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు.

బ్యాటు, బంతితో అతనిప్పుడు అత్యుత్తమ దశలో ఉన్నాడని.. జట్టు విజయంలో పాలుపంచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడని పేర్కొన్నాడో. మరోవైపు ఆంధ్రా కుర్రాడు హనుమ విహారిని సైతం కోహ్లీ ఆకాశానికెత్తేశాడు.

విహారి అంటే ఏంటో వెస్టిండీస్ సిరీస్‌లో తెలుసుకున్నామని.. అత్యంత ఒత్తిడిలో, సవాల్ విసిరే వికెట్‌పై అతని బ్యాటింగ్ అద్భుతమని ప్రశంసించాడు. విహారి నైపుణ్యం, ఆటతీరు అత్యున్నతంగా ఉన్నాయని వెల్లడించాడు. ఎన్నో ఏళ్ల నుంచి అజింక్య రహానె టాప్ ఆటగాడని విరాట్ తెలిపాడు. అతను తిరిగి ఫామ్‌లోకి రావడం బాగుందని అభిప్రాయపడ్డాడు.