భారత్-వెస్టిండిస్ మద్య జరగనున్న టెస్ట్ సీరిస్ లో కూడా టీ20, వన్డే ఫలితమే రిపీట్ అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో మైలురాయికి చేరుకోనున్నాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట వున్న ఓ అరుదైన రికార్డు కోహ్లీ ఖాతాలోకి చేరనుంది. ప్రస్తుతం టీమిండియా జోరు...విండీస్ పేలవ ప్రదర్శన అలాగే కొనసాగితే ఈ సీరిస్ లోనే కోహ్లీ ధోని రికార్డును బద్దలుగొట్టే అవకాశాలున్నాయి.  

వెస్టిండిస్ రెండు టెస్టుల సీరిస్ ను టీమిండియా క్వీన్ స్వీప్ చేస్తే కోహ్లీ ఖాతాలోకి 28వ టెస్ట్  విజయం చేరుతుంది. దీంతో గతంలో ధోని కెప్టెన్సీలో సాధించిన 27 విజయాల రికార్డు బద్దలవనుంది. ప్రస్తుతం కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా 26 టెస్ట్ మ్యాచులను గెలిచింది. ధోని 60 టెస్టులకు కెప్టెన్ గా  వ్యవహరించి 27 విజయాలు అందివ్వగా  కోహ్లీ కేవలం 46 టెస్టుల్లోనే 26 విజయాలను అందివ్వడం విశేషం.

ఇక ఇదే టెస్ట్ సీరిస్ లో కోహ్లీ వ్యక్తిగతంగా మరో రికార్డుకు చేరువలో నిలిచాడు. టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కోహ్లీ 18 సెంచరీలు బాదాడు. ఈ  టెస్ట్ సీరిస్ లో మరో సెంచరీ సాధిస్తే అతడు ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును బద్దలుగొట్టనున్నాడు. టెస్ట్ కెప్టెన్ గా పాటింగ్ 19 సెంచరీలు సాధించగా కోహ్లీ ప్రస్తుతం 18 సెంచరీలతో అతడి  తర్వాతి స్థానంలో నిలిచాడు. కెప్టెన్ గా అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన రికార్డు సౌతాఫ్రికా సారథి గ్రేమ్ స్మిత్ పేరిట వుంది. అతడు సారథిగా 25 సెంచరీలు సాధించాడు. 

ఓవరాల్ గా  టెస్టుల్లో కోహ్లీ ఇప్పటివరకు 25 సెంచరీలు బాదాడు. అయితే అందులో ఏడు అతడు టెస్ట్ కెప్టెన్ కాకముందు చేసినవి. వన్డే సీరిస్ లో మాదిరిగానే కోహ్లీ సెంచరీలు బాది జట్టును గెలిపిస్తే కెప్టెన్లుగా ధోని, పాంటింగ్ రికార్డులు బద్దలవనున్నాయి.