విరాట్ కోహ్లీ...ఈ పేరు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో సంచలనం. అంతర్జాతీయ క్రికెట్లో పరుగులు వరద పారిస్తున్న అతన్ని అభిమానులు ముద్దుగా రన్ మెషీన్ అని పిలుచుకుంటారు. దీన్ని బట్టే అతడి ఆటతీరు ఏ స్థాయిలో వుంటుందో అర్థం చేసుకోవచ్చు. తిరుగులేని బ్యాటింగ్ ప్రదర్శనతో ఎన్నో ప్రపంచ రికార్డులను బద్దలుగొడుతున్న కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ ప్రారంభమై నేటితో (ఆగస్ట్ 19) సరిగ్గా 11 ఏళ్లు పూర్తిచేసుంది. ఈ సందర్భంగా కోహ్లీ భావోద్వేగంతో కూడిన ఓ ట్వీట్ ను పోస్ట్ చేశాడు. 

''2008లో సరిగ్గా ఇదే రోజు యుక్త వయస్సులో క్రికెటర్ గా అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాను. అలా 11 ఏళ్ల సుధీర్ఘకాలం క్రికెటర్ గా తన జర్నీ కొనసాగుతోంది. ఈ స్థాయికి ఎదుగుతానని కలలో కూడా ఊహించలేదు. కానీ ఆ దేవుడు అనుగ్రహం నాపై వుండటంతో ప్రస్తుతమున్న ఉన్నత స్థాయికి చేరుకోగలిగాను. మీరు  కూడా మీ  సామర్థ్యం, బలాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ కలల్ని నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నా. అదీ మంచి మార్గాన్ని ఉపయోగించి కలలను సాకారం చేసుకోవాలని కోరుకుంటున్నా.'' అంటూ కోహ్లీ తన 11ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం గురించి స్పందించాడు. 

కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో 2008 లో శ్రీలంకతో జరిగిన వన్డే ద్వారా ఆరంగేట్రం చేశాడు. అందివచ్చిన అవకాశాలను వినియయోగించుకుంటూ కోహ్లీ అంచెలంచెలుగా ఎదిగాడు. మొదట జట్టులో స్థిరమైన స్థానాన్ని పొంది ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా క్రమక్రమంగా తన ఆటలో మరింత పదును పెంచి సెంచరీల వేట మొదలెట్టాడు. అతడి పరుగుల దాహానికి ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి.  బ్యాట్స్ మెన్ గా అద్భుతంగా రాణిస్తూ కీలక ఆటగాడిగా మారిన అతడికి టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు కూడా అందాయి. ఇలా ఈ ప్రపంచ కప్ లో కోహ్లీ సారథ్యంలోనే భారత జట్టు బరిలోకి  దిగింది. 

మొత్తంగా ఈ 11ఏళ్ల ప్రయాణంలో(239 వన్డే, 77టెస్ట్, 70 టీ20లలో) కోహ్లీ పరుగుల వరద పారించాడు. అతడి పరుగుల దాహానికి ఇటీవలే మాజీ కెప్టెన్ గంగూలీ రికార్డు బద్దలయ్యింది. భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు జాబితాలో కోహ్లీ (11,520 పరుగులతో) రెండో స్థానానికి చేరుకున్నాడు. అంతకు  ముందు గంగూలీ 11,363 పరుగులతో రెండో స్థానంలో వుండగా ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో మొదటి స్థానంలో నిలిచాడు.