సౌతాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సీరిస్ లో రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ విషయంలో కెప్టెన్ కోహ్లీ నుండి రోహిత్ కు పూర్తి మద్దతు లభించింది.
రోహిత్ శర్మ... పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా ఓపెనర్. ఈ పార్మాట్లలో అతడెంత గొప్ప ఓపెనరో ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచ కప్ లో బయటపడింది. అంతకుముందు కూడా అతడు అంతర్జాతీయ వన్డే, టీ20 మ్యాచుల్లో ఓపెనర్ గా రికార్డుల మోత మోగించాడు. అయితే అతడి దూకుడైన బ్యాటింగ్ శైలి టీ20, వన్డేలకు సరిగ్గా సరిపోగా టెస్టులకు సరిపోతుందా అన్న అనుమానం అభిమానుల్లోనే కాదు టీమిండియా మేనేజ్‌మెంట్ లో వున్నట్లుంది. అందుకోసమే అతడితో ఇప్పటివరకు టెస్టుల్లో అతడికి ఓపెనర్ గా అవకాశమివ్వలేదు.
కానీ ఇటీవలే ముగిసిన వెస్టిండిస్ సీరిస్ తర్వాత మేనేజ్‌మెంట్ తమ అభిప్రాయాన్ని మార్చుకున్నట్లుంది. అందువల్లే స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సీరిస్ కు రోహిత్ ను ఎంపికచేయడమే కాదు ఓపెనర్ గా బరిలోకి దింపేందుకు సిద్దమైంది. కానీ ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ తరపున రోహిత్ ఓపెనర్ గా బరిలోకి దిగి డకౌటయ్యాడు. దీంతో మరోసారి అతడి టెస్ట్ ఓపెనింగ్ పై అనుమానాలు మొదలయ్యాయి.
అయితే ఈ టెస్ట్ సీరిస్ లో రోహిత్ ఓపెనింగ్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అతడికి కెప్టెన్ విరాట్ కోహ్లీ నుండి పూర్తి మద్దతు లభించింది. '' రోహిత్ టెస్ట్ ఓపెనర్ గా రాణిస్తాడన్న నమ్మకం నాకుంది. కాస్త ఆలస్యమైనా అతడికి టెస్టుల్లో ఓపెనింగ్ చేసే అవకాశం వచ్చింది. దాన్ని అతడు సద్వినియోగం చేసుకుంటాడని భావిస్తున్నా.
కేవలం ఒకేఒక మ్యాచ్ ద్వారా ఆటగాడి ప్రతిభ బయటపడుతుందని నేను అనుకోను. అందువల్లే రోహిత్ కు కూడా వీలైనన్ని ఎక్కువ అవకాశాలివ్వాలి. అప్పుడే అతడు టెస్ట్ పార్మాట్ కు తగ్గట్లు తయారవగలడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్ గా తనను తాను ప్రూఫ్ చేసుకున్న అతడు ఇక టెస్టుల్లోనూ అలాగే రాణించాలని కోరుకుంటున్నా.'' అంటూ రోహిత్ కు కోహ్లీ మద్దతుగా నిలిచాడు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 1, 2019, 4:49 PM IST