మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచ కప్ మెగా టోర్నీలో భారత జట్టు హాట్ ఫెవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఈసారి ప్రపంచ కప్ ఎవరు గెలుస్తారన్న చర్చ ఎక్కడ జరిగినా ముందుగా వినిపిస్తున్న పేరు టీమిండియాదే. ఇలా మంచి ఊపుమీదున్న భారత ఆటగాళ్లు మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్ ప్లైటెక్కనున్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 

మీడియాతో కోహ్లీ మాట్లాడుతూ...మాజీ కెప్టెన్ ధోనిని ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ ప్రపంచ కప్ లో టీమిండియా తరపున ఆడుతున్న బరిలోకి దిగుతున్న ధోని కీలక పాత్ర పోషిస్తాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా అతడి  సీనియారిటీ  టిమిండియాకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే వికెట్ కీపర్, బ్యాట్ మెన్ గా అతడు కీలక సమయాల్లో మ్యాచ్ ను మలుపుతిప్పగలడు. అందువల్లే ధోనిని కీలక ఆటగాడని పేర్కొన్నట్లు కోహ్లీ వెల్లడించారు. 

అంతేకాకుండా  కోహ్లీ కుల్దీప్ యాదవ్ ఫామ్ పై అభిమానుల్లో నెలకొన్న అనుమానాల పట్ల స్పందించాడు. అతడు తప్పకుండా ప్రపంచ కప్ ఆరంభమయ్యే సమయానికి గాడిలో పడతాడన్న నమ్మకం వుందన్నాడు. కుల్దీప్, యజువేందర్ చాహల్ ఇద్దరూ టీమిండియా జట్టులో కీలకమైన బౌలర్లని...మిడిల్ ఓవర్లలో సత్తా చాటగల నేర్పరులని కోహ్లీ ప్రశంసించాడు. 

అలాగే ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ విషయంలోనూ ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నాడు. అతడు కూడా గాయం నుండి కోలుకుని ప్రపంచ కప్ ఆడతాడన్న విశ్వాసాన్ని  వ్యక్తం చేశాడు. బిసిసిఐ గతంలో ప్రకటించిన జట్టుతోనే తాము ప్రపంచ కప్ ఆడనున్నట్లు కోహ్లీ స్పష్టం చేశాడు. 

ఇక ఐపిఎల్ ద్యాసలో పడి బిసిసిఐ భారత ఆటగాళ్లను ప్రపంచ కప్ కోసం సన్నద్దం చేయడాన్ని విస్మరించిందన్న విమర్శలను కోహ్లీ కొట్టిపారేశాడు. ఓ వైపు ఐపిఎల్ లో పాల్గొంటూనే భారత  ఆటగాళ్లు ముఖ్యంగా బౌలర్లు ప్రపంచ కప్ కోసం కూడా సన్నద్దమయ్యారని  తెలిపాడు. ఆటగాళ్ళమంతా ఒత్తిడిని అదిగమిస్తే ఈసారి ప్రపంచ కప్ తమదేనని కోహ్లీ  ధీమా వ్యక్తం చేశాడు.