ప్రస్తుతం భారత దేశ క్రికెట్లోనే అంతర్జాతీయ క్రికెట్లోనూ టాప్ ప్లేయర్ గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. అభిమానులు ముద్దుగా రన్ మెషీన్ అని పిలుచుకుంటున్నారంటేనే అతడి పరుగుల వరద ఏ స్థాయిలో వుంటుందో అర్థ చేసుకోవచ్చు. అతడి పరుగుల దాహానికి అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాల రికార్డులు ఒక్కోటిగా బద్దలవుతున్నాయి. ఇలా భారత మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఆల్‌టైమ్ రికార్డులకు కోహ్లీ దగ్గరవుతున్నాడు. వీటన్నింటిని అధిగమించే సత్తా కోహ్లీ ఒక్కడికే వుందని అభిమానులే కాదు మాజీలు, క్రికెట్ పండితులు నమ్ముతున్నారు. 

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా కోహ్లీ ప్రదర్శనపై స్పందిస్తూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో సచిన్ సాధించిన గొప్ప రికార్డులు కొన్నింటిని కోహ్లీ ఇప్పటికే అధిగమించగా మరికొన్నింటికి చేరువలో వున్నాడు. అయితే టెస్ట్ క్రికెట్లో మాత్రం సచిన్ సాధించిన రికార్డులను అందుకోవడం అతడికి అంత సులభం కాదు. మరీముఖ్యంగా 200 టెస్టుమ్యాచులాడిన సచిన్ రికార్డును కోహ్లీ బద్దలుగొట్టడం కోహ్లీకి సాధ్యం కాదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. 

 సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలుగొట్టే సత్తా కోహ్లీ ఒక్కడికే వుందని అన్నాడు. అతడి ఫామ్ ను చూస్తుంటే అందుకు ఎంతో కాలం పట్టేలా లేదు. ఇప్పటికే వన్డే సెంచరీల విషయంలో సచిన్ రికార్డుకు అత్యంత సమీపంలో నిలిచాడు. కోహ్లీ ఇంకా చాలాకాలం అంతర్జాతీయ కెరీర్ కొనసాగించే అవకాశముంది కాబట్టి 100 సెంచరీలను పూర్తిచేసుకోగలడని సెహ్వాగ్ తెలిపాడు.  

ఇక కోహ్లీ కంటే ఆసిస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ గొప్ప ఆటగాడేమీ కాదని అన్నాడు. కోహ్లీ టెక్నిక్, బ్యాటింగ్ స్టైల్ స్మిత్ ఆటలో కనిపించవు. కాబట్టి నా దృష్టిలో కోహ్లీనే ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ అని సెహ్వాగ్ వెల్లడించాడు.