ప్రపంచ కప్ ముగిసిన తర్వాత టీమిండియా మొదటగా వెస్టిండిస్ తో తలపడనుంది. 3 టీ20, 3 వన్డే, 2 టెస్ట్ మ్యాచులు ఇలా మూడు సీరీసులను భారత్-విండిస్ లు వివిధ దేశాల్లో ఆడనున్నాయి. ఇలా మొదట యూఎస్ఎ లో జరగనున్న టీ20 సీరిస్ కోసం భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకుంది. అయితే ఈ సీరిస్  ఆరంభమవడానికి మరికొన్ని  రోజుల సమయం వుండటంతో ఆటగాళ్లు అమెరికాలో సరదాగా గడుపుతున్నారు. 

టీమిండియా ఆటగాళ్లకు భార్యా, పిల్లలను కూడా తమవెంట తీసుకెళ్లడానికి బిసిసిఐ అనుమతిచ్చింది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య, బాలీవుడ్ భామ అనుష్క శర్మతో కలిసి ప్లోరిడాలో చక్కర్లు కొడుతున్నాడు. ఇలా విరుష్క జంటతో కలిసి కొందరు ఎన్నారై యువత ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఫోటోల్లో నెటిజన్లను ఆకట్టుకున్నవి వైరల్ గా మారుతున్నాయి. 

ఇక టీమిండియాలోని మిగతా ఆటగాళ్లు కూడా అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నారు. ధోని స్థానంలో రిషబ్ పంత్, గాయం నుండి కోలుకున్న శిఖర్ ధవన్ తో పాటు మరికొందరు యువ ఆటగాళ్లు కూడా జట్టుతో పాటు యూఎస్ఎ కు చేరుకున్నారు. 

అమెరికా లో మ్యాచులు ముగిసిన తర్వాత టీమిండియా వివిధ దేశాల్లో పర్యటించనుంది. జమైకా, గయానా, ఆంటిగ్వా, ట్రినిడాడ్ లలో వన్డే, టెస్ట్ సీరీస్ లు జరగనున్నాయి.ఇలా పేరుకే వెస్టిండిస్ సీరిస్ అయినా మ్యాచులు మొత్తం వేరు వేరు దేశాల్లో జరగనున్నాయి.