97 పరుగుల వద్ద అవుటైన కెప్టెన్ శిఖర్ ధావన్... హాఫ్ సెంచరీ చేసి పెవిలియన్ చేరిన శ్రేయాస్ అయ్యర్...
దాదాపు మూడేళ్లుగా అంతర్జాతీయ సెంచరీ చేయలేకపోతున్న శిఖర్ ధావన్, మరోసారి శతకాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో 213 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత జట్టు...
99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసిన శిఖర్ ధావన్, గుడకేశ్ మోటీ బౌలింగ్‌లో షామర్ బ్రూక్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 90+ స్కోర్ల వద్ద అవుట్ కావడం శిఖర్ ధావన్‌కి ఇది 10వ సారి. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ 27 సార్లు, రాహుల్ ద్రావిడ్ 12 సార్లు 90ల్లో అవుటయ్యి, శిఖర్ ధావన్ కంటే ముందున్నారు...
వెస్టిండీస్ పర్యటనలో 90ల్లో అవుటైన రెండో భారత కెప్టెన్‌గా నిలిచాడు శిఖర్ ధావన్. ఇంతకుముందు 2009లో ఎమ్మెస్ ధోనీ 95 పరుగుల వద్ద అవుట్ కాగా శిఖర్ ధావన్ 13 ఏళ్ల తర్వాత 97 పరుగులకి పెవిలియన్ చేరాడు...
ధావన్ అవుటైన కొద్దిసేపటికే శ్రేయాస్ అయ్యర్ కూడా పెవిలియన్ చేరాడు. 57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసిన శిఖర్ ధావన్ కూడా గుడకేశ్ మోటీ బౌలింగ్‌లోనే పూరన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. 36 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది భారత జట్టు...
అంతకుముందు తొలి వికెట్‌కి 18.4 ఓవర్లలో 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు శుబ్‌మన్ గిల్, శిఖర్ ధావన్. 53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్... రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. వెస్టిండీస్‌లో వన్డేల్లో అతి పిన్న వయసులో 50+ స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు శుబ్‌మన్ గిల్... 22 ఏళ్ల 215 రోజుల వయసులో విరాట్ కోహ్లీ, వెస్టిండీస్‌లో వన్డేల్లో 50+ స్కోరు నమోదు చేయగా, శుబ్‌మన్ గిల్ వయసు ప్రస్తుతం 22 ఏళ్ల 317 రోజులు...
శుబ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ బ్యాటింగ్ సచిన్ టెండూల్కర్- వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ జోడిని గుర్తుకు తెచ్చింది. ధావన్, టెండూల్కర్‌లా ఆడితే... శుబ్‌మన్ గిల్, వీరేంద్ర సెహ్వాగ్‌ల బౌండరీలతోనే డీల్ చేశాడు... క్రీజులో ఉన్నంతసేపు వీరేంద్ర సెహ్వాగ్‌లా బ్యాటింగ్ చేసిన శుబ్‌మన్ గిల్, పరుగు తీసేటప్పుడు బద్ధకం ప్రదర్శించి వికెట్ పారేసుకున్నాడు. కెరీర్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ చేసిన గిల్, సింగిల్ తీయడంలో కాస్త వేగం చూపించి ఉంటే సెంచరీ మార్కు అందుకునేవాడే...
వెస్టిండీస్‌లో భారత జట్టుకి వన్డేల్లో తొలి వికెట్‌కి 119 పరుగుల భాగస్వామ్యం మూడో అత్యధికం. ఇంతకుముందు శిఖర్ ధావన్, రహానేతో కలిసి 132 పరుగులు, రోహిత్ శర్మతో కలిసి 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు... వెస్టిండీస్‌లో శిఖర్ ధావన్‌కి ఇది ఐదో 50+ స్కోరు. విరాట్ కోహ్లీ 7 సార్లు 50+ స్కోరు చేసి టాప్‌లో ఉంటే, రోహిత్ శర్మ ఐదు సార్లు ఈ ఫీట్ సాధించి ధావన్‌తో సమానంగా ఉన్నాడు..
శిఖర్ ధావన్‌కి ఇది 150వ వన్డే. తొలి 150 వన్డేల్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు శిఖర్ ధావన్. హషీమ్ ఆమ్లా 57, విరాట్ కోహ్లీ, వీవిన్ రిచర్డ్స్ 55 సార్లు 50+ స్కోర్లు చేయగా శిఖర్ ధావన్‌కి ఇది 53వ 50+ స్కోరు... అతి పెద్ద వయసులో వన్డేల్లో హాఫ్ సెంచరీ చేసిన భారత కెప్టెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు శిఖర్ ధావన్. ఇంతకుముందు 1999లో కెప్టెన్‌గా చివరి హాఫ్ సెంచరీ చేసినప్పుడు మహ్మద్ అజారుద్దీన్ వయసు 36 ఏళ్ల 120 రోజులు. ప్రస్తుతం ధావన్ వయసు 36 ఏళ్ల 229 రోజులు...
