Asianet News TeluguAsianet News Telugu

టీమిండియా భారీ షాక్! కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్... ఐదో టెస్టుకి కెప్టెన్‌గా జస్ప్రిత్ బుమ్రా?...

శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో టీమిండియా సారథి రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్... ఐసోలేషన్‌కి తరలించిన వైద్యులు, సోమవారం మలివిడత పరీక్షలు..

Team India Captain Rohit Sharma tested Corona positive before 5th Test against England
Author
India, First Published Jun 26, 2022, 2:02 PM IST

ఇంగ్లాండ్‌తో నిర్ణయాత్మక ఐదో టెస్టు ఆరంభానికి ముందు టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్‌గా తేలింది. జూలై 1న ప్రారంభమయ్యే ఐదో టెస్టుకి రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది అనుమానంగా మారింది...

శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్‌గా రావడంతో అతన్ని వెంటనే ఐసోలేషన్‌కి పంపించారు. సోమవారం మరో విడత కరోనా పరీక్షలు నిర్వహించబోతున్నారు. లీస్టర్‌షైర్‌తో జరుగుతున్న నాలుగు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో పాల్గొంటున్న రోహిత్ శర్మ, భారత ప్లేయర్లందరితో సన్నిహితంగా మెలిగాడు. దీంతో టీమిండియాలో కరోనా కలవరం మొదలైంది...

ఐదో టెస్టు సమయానికి రోహిత్ శర్మ కోలుకోకపోతే వైస్ కెప్టెన్‌గా ఉన్న జస్ప్రిత్ బుమ్రాకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ, ఆ తర్వాత కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేశాడు. మిగిలిన ప్లేయర్లంతా ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత ఆలస్యంగా జట్టుతో చేరాడు రోహిత్...

ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు ఆరంభానికి ముందు కరోనా బారిన పడిన మూడో భారత ప్లేయర్ రోహిత్ శర్మ. ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా పాజిటివ్‌గా తేలి, టీమ్‌తో కలిసి ఇంగ్లాండ్‌కి వెళ్లలేకపోయాడు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆలస్యంగా జట్టుతో చేరాడు రవిచంద్రన్ అశ్విన్...

అలాగే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కరోనా బారిన పడినట్టు వార్తలు వచ్చాయి. ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత మాల్దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేసిన విరాట్ కోహ్లీ, అక్కడి నుంచి వచ్చిన తర్వాత కరోనా బారిన పడ్డాడని, దాని నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత టీమ్‌తో కలిసి ఇంగ్లాండ్ చేరుకున్నాడని సమాచారం. అయితే ఈ వార్తలపై ఇప్పటిదాకా అధికారిక సమాచారం మాత్రం రాలేదు...

రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే ఐదో టెస్టులో టీమిండియా విజయం  సాధించడం కష్టంగా మారొచ్చు. గత పర్యటనలో విదేశాల్లో మొట్టమొదటి టెస్టు సెంచరీ అందుకున్న రోహిత్ శర్మ, ఈ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా ఉన్నాడు. కెప్టెన్‌గా కాకుండా కనీసం బ్యాటర్‌గా అయినా రోహిత్ శర్మ అవసరం టీమిండియాకి చాలా ఉంది...

అదీకాకుండా ఈ ఏడాది రోహిత్ శర్మ లేకుండా ఆడిన రెండు టెస్టుల్లోనూ పరాజయం పాలైంది టీమిండియా. సౌతాఫ్రికా టూర్‌లో గత ఏడాది చివర్లో సెంచూరియన్ టెస్టు గెలిచిన భారత జట్టు, ఆ తర్వాత ఈ ఏడాది ఆరంభంలో జరిగిన రెండు టెస్టుల్లోనూ ఓడిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా సిరీస్ ఆరంభానికి ముందు గాయం కారణంగా టూర్‌కి అందుబాటులో లేని రోహిత్ శర్మ, మరోసారి విదేశీ టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమ్‌కి అందుబాటులో లేకపోవడం హాట్ టాపిక్ అయ్యింది.  

Follow Us:
Download App:
  • android
  • ios