ఫిట్ నెస్...ఈ పేరు చెప్పగానే భారత క్రికెటర్లలో ముందుగా గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. అతడు తన ఫిట్ నెస్ కాపాడుకుంటున్న పరుగుల వరద పారిస్తున్న విషయం తెలిసిందే. వికెట్ల మధ్య పరుగెడుతూ పరుగులు రాబట్టడంలో అతడి తర్వాతే ఎవరయినా. అలాంటి కోహ్లీయే మాజీ కెప్టెన్, బ్యాట్స్ మెన్ కమ్ వికెట్ కీపర్ ధోనితో కలిసి వికెట్ల మధ్య పరుగెత్తలేకపోయాడట. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీయే వెల్లడించాడు. 
 
''ఆ రోజు సాగిన ఆటను నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఇతడితో(ధోని) కలిసి వికెట్ల మధ్య పరుగెత్తడం ఫిట్ నెస్ పరీక్షలా అనిపించింది. '' అంటూ కోహ్లీ గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచ్ లో ధోని, కోహ్లీలు కలిసి భారత్ కు అద్భుత విజయాన్ని అందించారు. 

 టీ20 ప్రపంచకప్ 2016 లో భాగంగా మొహాలీలో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ను కోహ్లీ గుర్తుచేసుకున్నాడు.  ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసిస్ 161 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. అయితే ఆదిలోనే వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకున్న భారత్ చివరి ఆరు ఓవర్లలో 67 పరుగులు  చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో ధోనితో కలిసిక కోహ్లీ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను  విజయతీరాలకు చేర్చారు.

వీరిద్దరు కేవలం భారీ షాట్లతో విరుచుకుపడటమే కాకుండా వికెట్ల మధ్య పరుగెడుతూ సింగిల్స్, డబుల్స్ రాబట్టారు. ఓ ఓవర్లో అయితే నాలుగు డబుల్స్ తీశారు. అయితే ఆ సమయంలో ధోనితో కలిసి పరుగెత్తడం చాలా కష్టంగా అనిపించిదని తాజాగా కోహ్లీ గుర్తుచేసుకున్నాడు.