టీమ్ ఇండియా పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు. వన్డేల్లో వెస్టిండీస్‌పై అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా పాక్ దిగ్గజం జావెద్ మియాందాద్ పేరిట 26 ఏళ్లుగా ఉన్న రికార్డుకు కోహ్లీ కొద్దిదూరంలో మాత్రమే నిలిచాడు.

మియాందాద్ విండీస్‌పై 64 ఇన్నింగ్సుల్లో 1930 పరుగులు చేశాడు. ఇక కోహ్లీ విషయానికి వస్తే 33 ఇన్నింగ్సుల్లో 1912 పరుగులు చేశాడు. వీరిద్దరి తర్వాత ఆస్ట్రేలియా మాజి క్రికెటర్ మార్క్ వా 45 ఇన్నింగ్సుల్లో 1708 పరుగులు, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలీస్ 1666, పాక్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా 1624 పరుగులు చేశారు.

ఆదివారం రాత్రి పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరగబోయే రెండో వన్డేలో కోహ్లీ 19 పరుగులు చేస్తే మియాందాద్ రికార్డు బద్ధలుకానుంది. కాగా.. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గయానాలో జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దవ్వడంతో ఆదివారం జరగనున్న రెండో వన్డేకు సైతం ముప్పు ఉందనే వార్తలు వస్తున్నాయి