వెస్టిండిస్ పర్యటనలో టీమిండియా ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఒకరు కాకుంటే మరొకరు ఆదుకుని జట్టును విజయతీరాలకు చేరుస్తున్నారు. ఇలా మొదటి టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా ఆ పని చేశాడు. అతడు విజృంభించడంతో విండీస్ కేవలం 100 పరుగులకే కుప్పకూలింది. ఇలా అద్భుతంగా సాగిన బుమ్రా ప్రదర్శనపై బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. 

'' తాను ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడని అత్యుత్తమ బౌలింగ్ స్పెల్స్ బుమ్రా వేశాడు. మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో అతడు నిప్పులుచెరిగే బంతులతో విండీస్  ను బెంబేలెత్తించాడు. పరిస్థితులకు తగ్గట్లు లైన్ ఆండ్ లెంగ్త్ ను మార్చుకుంటూ బౌలింగ్ చేసిన విధానం అద్భుతంగా వుంది. బుమ్రా స్పెల్ ఎంత గొప్పగా సాగిందో అతడి గణాంకాలను బట్టే తెలుస్తోంది. 

నిలకడగా 140  కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడం మామూలు విషయం కాదు. అలా వేగాన్ని మెయింటేన్ చేస్తూ వైవిధ్యమైన బంతులు విసరడం బుమ్రా బౌలింగ్ స్టైల్. అందువల్లే నేను అందరు బౌలర్లకు వారు చేసే తప్పుల గురించి పదేపదే గుర్తుచేస్తా. కానీ బుమ్రా ఒక్కడి విషయంలోనే కేవలం  లెంగ్త్ సవరించుకోమని  చెబుతుంటా. దీనికి మించి అతడి బౌలింగ్ లో తప్పులు పట్టడానికి ఏం వుండదు. 

ఏ బౌలర్ కైనా అంతిమంగా వికెట్లు సాధించమే అంతిమ లక్ష్యం. బుమ్రా కూడా అదే లక్ష్యంతో ఆడతాడు. కానీ ఆరంభంనుండే కేవలం వికెట్ల  కోసమే కాకుండా ముందుగా సిద్దం చేసుకున్న ప్రణాళికలను అమలు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలోనే వికెట్లు వాటంతట అవే పడుతుంటాయి. ఆలా విండీస్ తో జరిగిన మొదటి టెస్టులో 8 ఓవర్లు వేసి 7 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకున్నాడు. '' అంటూ బుమ్రాను భరత్ అరుణ్ ఆకాశానికెత్తేశాడు.