సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సెలబ్రిటీలు వారికి తెలియకుండానే ప్రమాదాలకు గురవుతున్నారు. మరికొందరయితే  ఏకంగా మృతిచెందుతున్నారు. ఇలా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులకు సంబంధించిన అసత్య వార్తలను కొందరు ఆకతాయిలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ రాక్షసానందాన్ని పొందుతున్నారు. ఈ వార్తలను స్ప్రెడ్ చేయడం ద్వారా వారికి కలిగే లాభమేమిటో తెలీదు కానీ తాను చావలేదు మొర్రో అని సెలబ్రెటీలు స్వయంగా ప్రకటించే స్థాయిలో ఈ ప్రచారం జరుగుతోంది. 

ఇలా ఇదివరకే టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా ప్రమాద వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమైన విషయం తెలిసిందే. దీనిపై స్వయంగే రైనానే స్పందించి తనకేమీ కాలేదని వివరణ ఇచ్చుకున్నాడు కూడా. తాజాగా శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్యపై కూడా ఇలాంటి వార్తే ప్రచారంలోకి వచ్చింది. అతడు కెనడాలో ఓ రోడ్డు ప్రమాదం కారణంగా మృతిచెందాడన్నది ఆ పేక్ న్యూస్ సారాంశం. ఇది ఎంతలా ప్రచారమయ్యిందంటే టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ నిజంగానే జయసూర్య చనిపోయాడా అంటూ ట్విట్ చేసేలా చేసింది. 

జయసూర్యకు కెనడాలో రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందినట్లు  ఓ పేక్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తపై ఏకంగా జయసూర్యనే స్పందించి తాను మృతిచెందినట్లు వస్తున్న వార్తను ఖండిచాడు. '' నేను మరణించానని, నా ఆరోగ్యం బాలేదని కొన్ని వెబ్‌సైట్ల ద్వారా తప్పుడు వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది. దయచేసి అలాంటి వార్తలను నమ్మకండి. నేను కెనడాకు వెళ్లి ప్రమాదానికి గురయ్యానన్నది అవాస్తవం. ప్రస్తుతం శ్రీలంకలోనే ఉన్నాను. దయచేసి ఈ తప్పుడు వార్తల నమ్మి ఇతరులకు షేర్‌ చేయకండి.'' అని జయసూర్య అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది. 

తాజాగా మరోసారి ఈ తప్పుడు ప్రచారం జోరందుకుంది. ఎంతలా అంటే ఈ వార్త టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ను కూడా బోల్తా కొట్టించి ట్వీట్టర్ ద్వారా జయసూర్య ఆరోగ్యంపై ఆరా తీసేలా చేసింది.  ‘జయసూర్య గురించి వస్తున్న వార్త నిజమేనా? నాకు వాట్సాప్‌లో ఈ సమాచారం (జయసూర్య మృతిచెందినట్లు) వచ్చింది. కానీ ట్విటర్‌లో ఎక్కడా కనిపించలేదు.’అంటూ అశ్విన్ ట్వీట్‌ చేశాడు. అయితే అభిమానులు ఇది ఫేక్ న్యూస్ అని...ఇందుకు సంబంధించి జయసూర్య చేసిన ట్వీట్ ను కూడా కొందరు అశ్విన్ కు పంపించారు. ఇంతచేస్తేగాని ఈ పేక్ న్యూస్ పై అశ్విన్ క్లారిటీ రాలేదు.