జింబాబ్వేపై రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో విజయం అందుకున్న భారత జట్టు... వన్డే సిరీస్ 2-0 తేడాతో కైవసం..
162 పరుగుల స్వల్ప లక్ష్యం.. అది కూడా క్రికెట్ పసికూన జింబాబ్వేతో మ్యాచ్... అయినా ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి చచ్చీ చేడి, పడుతూ లేస్తూ ఎలాగో గెలిచామనిపించుకుంది టీమిండియా. రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో విజయం అందుకున్న భారత జట్టు, వన్డే సిరీస్‌ని 2-0 తేడాతో కైవసం చేసుకుంది...
దాదాపు ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న కెఎల్ రాహుల్, 5 బంతుల్లో 1 పరుగు చేసిన నయాచి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. జింబాబ్వేపై అత్యల్ప స్కోరు చేసిన భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు కెఎల్ రాహుల్. 5 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు.. 21 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేసిన శిఖర్ ధావన్, తనకా చివంగ బౌలింగ్‌లో అవుట్ కాగా, ఇషాన్ కిషన్ 13 బంతుల్లో 6 పరుగులు చేసి జాంగ్వే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
34 బంతుల్లో 6 ఫోర్లతో 33 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, జాంగ్వే బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. దీంతో 97 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. 36 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసిన దీపక్ హుడాని సికందర్ రజా బౌల్డ్ చేశాడు. సంజూ శాంసన్ 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు, అక్షర్ పటేల్ 6 పరుగులు చేసి భారత జట్టును విజయ తీరాలకు చేర్చారు...
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 38.1 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆరంభ ఓవర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో జింబాబ్వే బ్యాటర్లు పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడ్డారు. సిరాజ్ రెండు మెయిడిన్ ఓవర్లు వేయగా ప్రసిద్ధ్ కృష్ణ ఓ మెయిడిన్ ఓవర్ వేశాడు. 32 బంతుల్లో 7 పరుగులు చేసి టకుజ్వానషే కైటానో, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు...
27 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన ఇన్నోసెంట్ కియా, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 5 బంతుల్లో 2 పరుగులు చేసిన జింబాబ్వే కెప్టెన్ రెగిస్ చెక్‌బవా, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా 12 బంతుల్లో 2 పరుగులు చేసిన విస్లే మెదెవెరేని ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు...
మొదటి వన్డే మాదిరిగానే 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది జింబాబ్వే. ఈ దశలో సికిందర్ రజా, సీన్ విలియమ్స్ కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కి 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 31 బంతుల్లో 16 పరుగులు చేసిన సికందర్ రజా, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
ఆ తర్వాత ఆరో వికెట్‌కి 33 పరుగులు జోడించిన సీన్ విలియమ్స్, 42 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసి దీపక్ హుడా బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 16 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన లూక్ జాంగ్వేని శార్దూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేయగా, 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన బ్రాడ్ ఇవెన్స్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు...
వికెట్ర్ నయాచి బంతులేమీ ఎదుర్కోకుండానే రనౌట్ రూపంలో డైమండ్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. వస్తూనే బౌండరీ బాదిన తనటా చికవంగ కూడా రనౌట్ కావడంతో 161 పరుగుల వద్ద జింబాబ్వే ఇన్నింగ్స్‌కి తెరపడింది. 47 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేసిన రియాన్ బర్ల్ నాటౌట్‌గా నిలిచాడు.
భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా తలా ఓ వికెట్ తీశారు.
