151 పరుగులకి వెస్టిండీస్ ఆలౌట్... 200 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న టీమిండియా.. 2-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం..
రెండో వన్డేలో వెస్టిండీస్ చేతుల్లో ఊహించని పరాజయం ఎదుర్కొన్న టీమిండియా, ఆఖరి వన్డేలో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి విండీస్‌పై ఘన విజయం అందుకుంది.
352 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలో దిగిన వెస్టిండీస్, 35.5 ఓవర్లలో 151 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టీమిండియాకి 200 పరుగుల తేడాతో భారీ విజయం దక్కింది.
మొదటి ఓవర్‌లోనే బ్రెండన్ కింగ్‌ని డకౌట్ చేసిన ముకేశ్ కుమార్, తన తర్వాతి ఓవర్‌లో కైల్ మేయర్స్‌ని అవుట్ చేశాడు. కెప్టెన్ షై హోప్ కూడా 5 పరుగులు చేసి ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్..
కీసీ కర్టీ 6, సిమ్రాన్ హెట్మయర్ 4, రొమారియో షెఫర్డ్ 8 పరుగులు చేసి వెంటవెంటనే పెవిలియన్ చేరారు. 50 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది వెస్టిండీస్..
ఈ దశలో అలిక్ అతనజే, కరియా కలిసి ఏడో వికెట్‌కి 25 పరుగుల భాగస్వామ్యం జోడించి, విండీస్‌ని ఆదుకునే ప్రయత్నం చేశారు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో కరియా అవుట్ అయినట్టు అంపైర్ ప్రకటించినా, డీఆర్‌ఎస్‌లో నాటౌట్‌గా తేలడంతో విండీస్‌కి అనుకూలంగా ఫలితం వచ్చింది..
50 బంతుల్లో 3 ఫోర్లతో 32 పరుగులు చేసిన అలిక్ అతనజేని క్లీన్ బౌల్డ్ చేసిన కుల్దీప్ యాదవ్, 33 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసిన కరియాని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు.
88 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్. అయితే అల్జెరీ జోసఫ్, గుడకేశ్ మోతీ కలిసి బౌండరీలతో భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 9వ వికెట్‌కి 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 39 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసిన అల్జెరీ జోసఫ్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. జేడన్ సీల్స్‌ని శార్దూల్ ఠాకూర్ అవుట్ చేయగా 34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేసిన గుడకేశ్ మోతీ నాటౌట్‌గా నిలిచాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 351 పరుగుల భారీ స్కోరు చేసింది..
ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్ కలిసి తొలి వికెట్‌కి 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వెస్టిండీస్‌లో టీమిండియాకి ఇదు అతి పెద్ద ఓపెనింగ్ భాగస్వామ్యం.. 2017లో అజింకా రహానే, శిఖర్ ధావన్ కలిసి తొలి వికెట్‌కి జోడించిన 132 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసింది శుబ్‌మన్ గిల్- ఇషాన్ కిషన్ జోడి...
వరుసగా మూడో వన్డేలోనూ హాఫ్ సెంచరీ అందుకున్న ఇషాన్ కిషన్, 64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేసి స్టంపౌట్ అయ్యాడు. మూడో స్థానంలో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసి అల్జెరీ జోసఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు..
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సంజూ శాంసన్, శుబ్‌మన్ గిల్‌తో కలిసి మూడో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసిన సంజూ శాంసన్, వన్డేల్లో మూడో హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
హాఫ్ సెంచరీ తర్వాత భారీ షాట్‌కి ప్రయత్నించిన సంజూ శాంసన్, రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో హెట్మయర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 92 బంతుల్లో 11 ఫోర్లతో 85 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, సెంచరీకి ముందు పెవిలియన్ చేరాడు..
సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా కలిసి ఐదో వికెట్‌కి 65 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు..
కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, 45 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. హార్ధిక్ పాండ్యా 52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా రవీంద్ర జడేజా 7 బంతుల్లో 8 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కి 19 బంతుల్లో 42 పరుగుల భాగస్వామ్యం జోడించారు.
