Asianet News TeluguAsianet News Telugu

ఐర్లాండ్‌పై ప్రతాపం చూపించిన హార్ధిక్ సేన... తొలి టీ20లో టీమిండియా ఘన విజయం...

9.2 ఓవర్లలో మ్యాచ్‌ని ఫినిష్ చేసిన టీమిండియా... తొలి టీ20పై ఐర్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం... దీపక్ హుడా మెరుపులు..

Team India beats Ireland in First T20I, Rain interrupted match dominates Hardik Pandya
Author
India, First Published Jun 27, 2022, 1:23 AM IST

పసికూన ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ని ఘన విజయంతో ఆరంభించింది టీమిండియా. వర్షం కారణంగా టీ12గా మారిన మొదటి టీ20లో హార్ధిక్ పాండ్యా టీమ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. 12 ఓవర్లలో 109 పరుగుల భారీ లక్ష్యఛేదనని తన స్టైల్‌లో దూకుడుగా ఆరంభించాడు ఇషాన్ కిషన్. ఓపెనింగ్ వచ్చిన దీపక్ హుడా సింగిల్స్ తీస్తూ స్ట్రైయిక్ రొటేట్ చేయడానికే ప్రాధాన్యం ఇవ్వగా ఇషాన్ కిషన్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసి.. క్రెగ్ యంగ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 

ఆ తర్వాతి బంతికే సూర్యకుమార్ యాదవ్‌ని ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చి, టీమిండియాకి ఊహించని షాక్ ఇచ్చాడు క్రెగ్ యంగ్. సూర్యకుమార్ యాదవ్‌కి టీ20ల్లో ఇదే మొట్టమొదటి గోల్డెన్ డకౌట్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాత ఐర్లాండ్‌పై డకౌట్ అయిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్.. అయితే ఐర్లాండ్‌పై గోల్డెన్ డకౌట్ అయిన మొట్టమొదటి భారత క్రికెటర్ మాత్రం సూర్యనే. ఇంతకుముందు భారత మహిళా జట్టు క్రికెటర్లు కూడా ఎవ్వరూ ఐర్లాండ్‌పై మొదటి బంతికే పెవిలియన్ చేరలేదు.

టూ డౌన్‌లో వచ్చిన హార్ధిక్ పాండ్యాతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు దీపక్ హుడా. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో వరుస బంతుల్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లను అవుట్ చేసిన క్రెగ్ యంగ్, ఆ తర్వాత ఐదో ఓవర్‌లో 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే ఆండీ మెక్‌బ్రెన్ వేసిన ఆరో ఓవర్‌లో మూడు సిక్సర్లు బాది 21 పరుగులు రాబట్టారు హార్ధిక్, దీపక్ హుడా...

12 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 24 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, 8వ ఓవర్ ఆఖరి బంతికి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అయితే అప్పటికే ఆ ఓవర్‌లో 16 పరుగులు రావడంతో భారత జట్టు విజయం దాదాపు ఖరారైపోయింది. 

దీపక్ హుడా 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేయగా దినేశ్ కార్తీక్ 5 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌లో చాలా సమయం వృథా కావడంతో తొలి టీ20ని 12 ఓవర్ల మ్యాచ్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు... తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్, నిర్ణీత 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. ఒకానొక దశలో 4 ఓవర్లు ముగిసే సరికి 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్, హారీ టెక్టర్ సునామీ హాఫ్ సెంచరీ కారణంగా భారీ స్కోరు చేయగలిగింది.

మొదటి ఓవర్‌లోనే ఐర్లాండ్ కెప్టెన్ బాల్బరిన్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు భువనేశ్వర్ కుమార్. 2 బంతులాడిన బాల్బరిన్, పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో పాల్ స్టిర్లింగ్‌ని పెవిలియన్ చేర్చాడు హార్ధిక్ పాండ్యా.5 బంతులాడిన పాల్ స్టిర్లింగ్ ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసి, దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

డెలనీ 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఐర్లాండ్. ఈ దశలో వికెట్ కీపర్ టక్కర్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు హారీ టెక్టర్. 16 బంతుల్లో 2 సిక్సర్లతో 18 పరుగులు చేసిన టక్కర్‌ని యజ్వేంద్ర చాహాల్ అవుట్ చేశాడు. అయితే హారీ టెక్టర్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసి టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 

ఆరంగ్రేటం మ్యాచ్ ఆడుతున్న ఉమ్రాన్ మాలిక్‌కి ఒకే ఒక్క ఇచ్చిన హార్ధిక్ పాండ్యా, ఆ ఓవర్‌లో అతను 14 పరుగులు ఇవ్వడంతో మళ్లీ బౌలింగ్ ఇవ్వకపోవడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios