Asianet News TeluguAsianet News Telugu

అంతా అయిపోయాకే నిద్రలేచిన టీమిండియా... ఆఫ్ఘాన్‌పై భారీ విజయంతో ఇంటికి...

4 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన భువీ... నామమాత్రపు మ్యాచ్‌లో 101 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న టీమిండియా... ఆసియా కప్ 2022 టోర్నీని మూడో స్థానంతో ముగించిన రోహిత్ సేన..

Team India beats Afghanistan after loosing back to back matches, Bhuvneshwar Kumar
Author
First Published Sep 8, 2022, 10:43 PM IST

పాకిస్తాన్, శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచుల్లో ఫెయిల్ అయి విమర్శలు ఎదుర్కొన్న భువీ,అంతా అయిపోయాక నామమాత్రపు మ్యాచ్‌లో ఆఫ్ఘాన్‌పై నిప్పులు చెరిగాడు. 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసిన భువీ, ఆఫ్ఘాన్‌కి చుక్కలు చూపించాడు. దీంతో 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘాన్, 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 111 పరుగులకి పరిమితమైంది. ఫలితంగా 101 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుని, ఆసియా కప్ 2022 టోర్నీకి ముగించింది భారత జట్టు.

మొదటి ఓవర్‌లో రెండు, మూడో ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన భువీ కారణంగా ఆఫ్ఘాన్, కోలుకునే అవకాశమే లేకుండా పోయింది. హజ్రతుల్లా జజాయి, రెహ్మనుల్లా గుర్భాజ్, నజీబుల్లా జద్రాన్ డకౌట్ కాగా కరీం జనత్ 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఆఫ్ఘాన్... మహ్మద్ నబీ 7 పరుగులు చేసి అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో అవుట్ కాగా అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ని అవుట్ చేసిన భువీ... 5 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు...

19 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన రషీద్ ఖాన్, దీపక్ హుడా బౌలింగ్‌లో అవుట్ కావడంతో 54 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది ఆఫ్ఘనిస్తాన్.. ముజీబ్ వుర్ రహ్మాన్, ఇబ్రహీం జాద్రన్ కలిసి 8వ వికెట్‌కి 33 పరుగులు జోడించారు..

13 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన ముజీబ్‌ని రవి అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన దినేశ్ కార్తీక్, రెండు సిక్సర్లతో 18 పరుగులు సమర్పించాడు. ఇబ్రహీం జాద్రన్ 59 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవడంతో కెఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు విరాట్ కోహ్లీ. మొదటి రెండు ఓవర్లు నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన ఈ ఇద్దరూ, మూడో ఓవర్ నుంచి బౌండరీలు బాదడం మొదలెట్టాడు. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కొద్దిసేపటికే కెఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు...

ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కి 119 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియాకి ఇదే అత్యధిక భాగస్వామ్యం. టీ20ల్లో 100+ సిక్సర్లు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, 3500+ పరుగులను అందుకున్నాడు...

 
41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసిన కెఎల్ రాహుల్‌ను ఫరీద్ అహ్మద్ అవుట్ చేయగా మొదటి బంతికి సిక్సర్ కొట్టిన సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాతి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

51 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్న విరాట్ కోహ్లీ, ఫజల్‌హక్ ఫరూకీ వేసిన ఆఖరి ఓవర్‌లో 6,6,4 బాది... 17 పరుగులు రాబట్టాడు. 61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 122 పరుగులు చేసిన విరాట్ కోహ్లీతో పాటు 16 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన రిషబ్ పంత్ నాటౌట్‌గా నిలిచాడు.. 
 

Follow Us:
Download App:
  • android
  • ios