టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పై వేటు పడింది. సహజంగానే పటిష్టమైన భారత విభాగాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడంలో బంగర్ విఫలమవడంవల్లే తొలగించినట్లు సమాచారం. అంతేకాకుండా ఇంటర్వ్యూ సందర్భంగా అతడు ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అడిగిన పలు ప్రశ్నలకు సరైన వివరణ ఇవ్వలేకపోయాడట. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని బంగర్ ను బ్యాటింగ్ కోచ్ గా తొలగించి మాజీ ప్లేయర్ విక్రమ్ రాథోడ్ కు ఆ పదవిని కట్టబెట్టారు. 

టీమిండియా సహాయ కోచ్ ల ఎంపిక ప్రక్రియను ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ చేపట్టింది. దరఖాస్తు చేసుకున్న ఆటగాళ్ల అనుభవం, అర్హతలతో పాటు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేపట్టారు. ఈ సందర్భంగా ప్రస్తుత కోచింగ్ సిబ్బంది కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెలెక్టర్లు సంధించిన పలు ప్రశ్నలకు సంజయ్ బంగర్ సరైన వివరణ ఇవ్వలేకపోయాడట. దీంతో అతడిపై వేటు పడినట్లు సమాచారం.

బంగర్ కు సెలెక్టర్లు సంధించిన ప్రశ్నలివే:

ప్రపంచ కప్ భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో ధోనిని ఏడో స్థానంలో ఎందుకు బ్యాటింగ్ చేయించాల్సివచ్చిందని ప్రశ్నించారు. ఆ నిర్ణయం వల్లే టీమిండియా ఓటమిపాలయ్యిందని అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అందుకు మీ వివరణ ఏమిటంటూ ప్రశ్నించగా బంగర్ నుండి సరైన వివరణ రానట్లు తెలుస్తోంది.   

ఇక ఎన్నో ఏళ్లుగా భారత జట్టుకు సమస్యగా మారిన నాలుగో స్ధానంలో సరైన బ్యాట్స్ మెన్ లేకపోవడంపై కూడా ప్రశ్నించారట. ఈ  స్థానానికి సరిపోయే ఆటతీరు గల ఆటగాన్ని గుర్తించడం గానీ, శిక్షణనిచ్చి స్వయంగా తయారుచేయడం గానీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారట. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో కూడా సరైన బ్యాట్స్ మెన్ లేక ఎవరో ఒకరిని ఈ స్ధానంలో ఆడించాల్సి వచ్చింది. ఈ విషయంలో మీ వివరణ ఏమిటని అడిగారట. 

ఇక కొన్ని టెస్టు మ్యాచుల్లో టీమిండియా ఓటమికి బ్యాటింగ్ విభాగం తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమన్న విమర్శలు వినిపించాయి. వీటిలో మీ పాత్ర ఎంతవరకుంది. నిజంగానే ఆ నిర్ణయాల వల్లే జట్టు ఓడిందని మీరు అంగీకరిస్తా అని ప్రశ్నించారట. 

పైన పేర్కొన్న మూడు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక సంజయ్ బంగర్ ఉక్కిరబిక్కిర అయ్యాడని సమాచారం. దీంతో  అతడిని కోచ్ పదవినుండి తొలగించాలని సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.