ఆస్ట్రేలియా టూర్‌లో ఆఖరి టెస్టు మ్యాచ్‌పై కొన్నాళ్లుగా అనేక వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ముఖ్యంగా బ్రిస్బేన్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడం, లాక్‌డౌన్ అమలులో ఉండడంతో అక్కడికి ప్రత్యేక విమానంలో చేరుకున్న తర్వాత భారత జట్టు క్రికెటర్లు, హోటల్ గదుల్లోనే క్వారంటైన్ గడపాల్సి ఉంటుందని కండీషన్ పెట్టింది క్రికెట్ ఆస్ట్రేలియా.

అయితే ఇప్పటికే ఆస్ట్రేలియాలో సిరీస్ ఆరంభానికి ముందు 14 రోజుల క్వారంటైన్ పూర్తిచేసుకున్న భారత జట్టు, ఇందుకు సిద్ధంగా లేదని... ‘జూలో జంతువుల్లా ఉండలేమని’... అవసరమైతే వేదిక మార్చాలని డిమాండ్ చేశారని వార్తలు వినిపించాయి.

‘నిబంధనలకు లోబడి ఆడలేకపోతే... ఇక్కడికి రావద్దంటూ’ క్వీన్‌లాండ్స్ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో నాలుగో టెస్టు జరుగుతుందో లేదోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు కూడా. అయితే ఎట్టకేలకు ఓ కండీషన్‌ మీద బ్రిస్బేన్ వేదికగా నాలుగో టెస్టు ఆడేందుకు అంగీకరించదట టీమిండియా.

‘టెస్టు ముగిసిన తర్వాత అదనంగా ఒక్కరోజు కూడా అక్కడ ఉండబోమని, తర్వాతి ఫ్లైట్‌కే తమను స్వదేశానికి తిరిగి పంపించే ఏర్పాట్లు చేయాలని’ కోరిందట బీసీసీఐ. దీనికి ఆసీస్ కూడా సుముఖంగానే ఉన్నట్టు టాక్.