Asianet News TeluguAsianet News Telugu

Virat Kohli: ఒక శకం ముగిసింది.. కెప్టెన్, కోచ్ గా విరాట్ కోహ్లి-రవి శాస్త్రిల రికార్డులివే..

Virat kohli-Ravi shastri Era: భారత  క్రికెట్ లో కెప్టెన్-కోచ్ గా విరాట్-శాస్త్రిల శకం ముగిసింది. ఐసీసీ టోర్నీలలో ట్రోఫీ తప్పిస్తే ఈ ద్వయం ఇటు స్వదేశంలోనూ అటు విదేశాల్లోనూ ఇరగదీసింది. ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఈ గురు శిష్యులు టీమిండియా కీర్తి ప్రతిష్టలు శిఖరాగ్రానికి చేర్చారు. 

Team India Achievements under Virat kohli-Ravi shastri Era
Author
Hyderabad, First Published Nov 9, 2021, 5:22 PM IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భాగంగా నిన్న నమీబియాతో జరిగిన మ్యాచ్ భారత అభిమానులకు చాలా కాలం గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్ లో భారీ రికార్డులేమీ నమోదు కాలేదు. ఆటగాళ్లెవరూ సంచలన ప్రదర్శన చేయలేదు.  టీమిండియా విజయం కూడా సాధారణమే. కానీ.. పొట్టి పార్మాట్ లో టీమిండియాకు కెప్టెన్ గా విరాట్ కోహ్లికి ఇదే ఆఖరు మ్యాచ్. అంతేగాక అతడు ఏరికోరి ఎంచుకున్న గురువు రవిశాస్త్రికి హెడ్ కోచ్ గా కూడా ఇదే చివరి మ్యాచ్. నమీబియాతో మ్యాచ్  అనంతరం భారత  క్రికెట్ లో కెప్టెన్-కోచ్ గా విరాట్-శాస్త్రి ల శకం ముగిసింది. అయితే ఐసీసీ టోర్నీలలో ట్రోఫీ తప్పిస్తే ఈ జోడీ సూపర్ హిట్టే. టెస్టులు, వన్డేలు, టీ20 లు అనే తేడా లేకుండా ఈ గురు శిష్యులు టీమిండియా కీర్తి ప్రతిష్టలు శిఖరాగ్రానికి చేర్చారు. 

విరాట్ కోహ్లి-రవిశాస్త్రి లు తమ హయాంలో టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. విరాట్ సారథిగా.. శాస్త్రి శిక్షకుడిగా భారత్.. 39 టెస్టులు, 67 వన్డేలు, 47 టీ20 లు ఆడింది. ఈ మూడు ఫార్మాట్లలో కలిపి వీరి విజయాల పరంపర ఎలా కొనసాగిందో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. 

టెస్టులు: 

విరాట్ సారథిగా..  రవి కోచ్ గా భారత్ 39 టెస్టులాడింది. ఇందులో భారత్ ఏకంగా 22 విజయాలు సాధించడం గమనార్హం. విజయాల శాతం 56.41 గా ఉంది. 13 టెస్టులు ఓటమి పాలవ్వగా.. ఒకటి డ్రా అయింది. ఇక ఈ 39 టెస్టులలో.. స్వదేశంలో భారత్.. 14 టెస్టులాడింది. అందులో 11 గెలిచి 1 ఓడి 2 డ్రా చేసుకుంది. స్వదేశంలో భారత్ విజయాల శాతం 79 శాతంగా ఉండటం విశేషం. ఇక విదేశాల్లో.. టీమిండియా 25 టెస్టులాడి 11 గెలచి 12 ఓడి .. రెండింటిని డ్రా చేసుకుంది.  విదేశాల్లో భారత విజయాల శాతం 44 శాతంగా ఉంది.  

వీరి హయాంలోనే భారత్.. 2018-19 బోర్డర్-గావస్కర్ ట్రోఫీతో పాటు ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ లో ఫైనల్ కు  వెళ్లడం గమనార్హం. ఆస్ట్రేలియాను  వారి దేశంలో ఓడించి సిరీస్ పట్టిన తొలి ఆసియా జట్టు టీమిండియానే. 

వన్డేలు: 

ఒకరోజు అంతర్జాతీయ మ్యాచులలో కూడా  ఈ ఇద్దరి రికార్డు బాగానే ఉంది. విరాట్ కెప్టెన్ గా రవిశాస్త్రి కోచ్ గా టీమిండియా 67 మ్యాచులాడింది. ఇందులో భారత్ 44 విజయాల్లో విజయం సాధించగా 21 మ్యాచుల్లో ఓడింది.  ఒక్కటి టై కాగా.. మరో మ్యాచులో ఫలితం తేలలేదు. విజయాల శాతం 67.42 గా ఉంది. కాగా, ఈ 67లో.. స్వదేశంలో 27 మ్యాచులాడగా.. 17 గెలిచి తొమ్మిదింట్లో ఓడింది. విజయాల శాతం 64.81 గా నమోదైంది. విదేశాల్లో 40 మ్యాచులు జరుగగా.. 27 గెలిచి 12 పరాజయం పాలైంది. ఒక్క మ్యాచులో ఫలితం తేలలేదు.   విజయాలు 69.23 శాతంగా నమోదయ్యాయి.     

టీ20: 

పరిమిత ఓవర్ల క్రికెట్ లో విరాట్-రవి ద్వయం 47 మ్యాచులాడి.. 30 విజయాలు, 15 పరాజయాలు నమోదు చేసింది.  రెండింటిలో ఫలితం తేలలేదు. విజయాల శాతం 66.67 గా నమోదైంది. మొత్తం మ్యాచులలో ఇండియా లో 20 మ్యాచులాడగా.. 11 విజయాలు, 8 పరాజయాలు నమోదవ్వగా ఒక్కదాంట్లో ఫలితం తేలలేదు. విదేశాల్లో 27 ఆడి.. ఏకంగా 19 విజయాలు, 7 ఓటములు వచ్చాయి. ఒక్కదాంట్లో ఫలితం రాలేదు. విజయాల శాతం 73.08 గా ఉంది. 

మొత్తంగా చూస్తే ఈ ద్వయం.. భారత్ కు స్వదేశంలోనే  కాదు విదేశాల్లో కూడా విజయాలను అలవాటుగా చేసుకోవడమెలాగో చేసి చూపించింది. మూడు ఫార్మాట్లలో.. 56.41 శాతం (టెస్టులు), 67.42 శాతం (వన్డేలు), 66.67 శాతం (టీ20లు) చిరస్మరణీయ విజయాలు అందించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios