ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో నో బాల్‌కీ, వైడ్ బాల్‌కీ డీఆర్‌ఎస్ సదుపాయం కల్పించిన బీసీసీఐ... ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ అమలు...  

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), క్రికెట్ ప్రపంచంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. పవర్ ప్లే ఫీల్డింగ్ మార్పుల దగ్గర్నుంచి నో బాల్, ఫ్రీ హిట్ ఇలా కొత్త మార్పులకు శ్రీకారం చుట్టిన ఐపీఎల్, ఈ ఏడాది ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ని ప్రవేశపెట్టనుంది... అవసరమైతే ప్లేయింగ్ ఎలెవన్‌లో లేని ప్లేయర్‌ని మ్యాచ్ ప్రారంభమైన తర్వాత మరొకరి స్థానంలో ఆడించేందుకు ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వీలు కల్పించనుంది.

అయితే 16 ఏళ్ల క్రితం వచ్చిన ఐపీఎల్ కంటే నిన్నగాక మొన్ననే ప్రారంభమైన డబ్ల్యూపీఎల్ ఇంకా అడ్వాన్స్‌ వెర్షన్‌లో ఉండడం విశేషం... ఐపీఎల్‌లో అంపైర్ల నిర్ణయాలను ఛాలెంజ్ చేసేందుకు డీఆర్‌ఎస్ అందుబాటులో ఉంది. అయితే అంపైర్ ఏ నిర్ణయం ఇచ్చినా ఛాలెంజ్ చేసే అవకాశం అయితే లేదు. అందుకే అంపైర్లు ఇచ్చే చాలా నిర్ణయాలు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి, తీవ్ర వివాదాస్పదమయ్యాయి... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో అంపైర్లు వైడ్ బాల్స్‌గా ప్రకటించిన డెలివరీలు కూడా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయి. ఓ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్, కెప్టెన్... అంపైర్ వైడ్ బాల్‌గా ప్రకటించిన తర్వాత డీఆర్‌ఎస్ కోరుకుంటున్నట్టు సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది... చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే అంపైర్ వైడ్ ఇవ్వలేదని, ప్లేయర్లను మ్యాచ్ ఆపేసి వచ్చేయాల్సిందిగా రిషబ్ పంత్ సిగ్నల్ ఇవ్వడం చాల ా పెద్ద రచ్చ లేపింది..

అయితే ఐపీఎల్‌లో డీఆర్‌ఎస్‌కి రివ్యూ తీసుకునే అవకాశం లేదు. అలాగే అంపైర్ నో బాల్‌గా ప్రకటించిన తర్వాత కూడా ప్లేయర్లు ఏమీ చేయలేరు. అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఈ వెసులుబాటు కల్పించింది బీసీసీఐ...

డబ్ల్యూపీఎల్‌లో ప్రతీ జట్టుకి అంపైర్ల నిర్ణయాలను ఛాలెంజ్ చేసేందుకు మూడు డీఆర్‌ఎస్ రివ్యూలు ఉంటాయి. అంపైర్ వైడ్ ఇవ్వకపోయినా, నో బాల్ ఇవ్వకపోయినా సదరు బ్యాటర్ డీఆర్‌ఎస్ తీసుకోవచ్చు. యూపీ వారియర్స్, గుజరాజ్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో యూపీ ప్లేయర్ గ్రేస్ హారీస్ ఈ విధంగా డీఆర్‌ఎస్ వాడి, వైడ్ రూపంలో ఎక్స్‌ట్రా పరుగు తీసుకొచ్చింది...

మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో విజయానికి 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సిన దశలో గ్రేస్ హారీస్ వాడిన ఈ డీఆర్‌ఎస్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది.. అలాగే ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డీసీ ప్లేయర్, నో బాల్ కోసం డీఆర్‌ఎస్ కోరుకుంది...

ఇదే రూల్‌ని పురుషుల ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లోనూ అమలు చేయబోతున్నారు. అయితే లెగ్ బైస్‌గా ప్రకటించిన పరుగులను మాత్రం డీఆర్‌ఎస్‌ తీసుకునే సదుపాయం ఉండదు..

బంతి బంతికి రిజల్ట్ మారిపోయే టీ20 క్రికెట్‌లో ప్రతీ పరుగు ఎంతో విలువైనదే. ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగే సందర్భాల్లో ప్లేయర్లతో పాటు అంపైర్లు కూడా కొంత ప్రెషర్‌కి గురవుతారు. ఈ సమయాల్లో అంపైర్లు తీసుకునే నిర్ణయాలు మ్యాచ్ రిజల్ట్‌నే మార్చేయొచ్చు. అంతేకాకుండా గత సీజన్‌లో అంపైర్లు ఇచ్చిన నో బాల్, వైడ్ బాల్స్ నిర్ణయాలు చాలా వివాదాస్పదమయ్యాయి. అందుకే ఈ సీజన్‌లో వీటికి కూడా డీఆర్‌ఎస్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది...