TATA IPL2022: వికెట్ తీశాక ఒక్కొక్క బౌలర్ ఒక్కో రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఒకరు అరుస్తారు.. ఒకరు బ్యాటర్లమీద గుర్రుగా చూస్తారు. మరొకరు పుష్ప స్టైల్ లో స్టెప్పులేస్తారు. కానీ ఈ ఆర్సీబీ బౌలర్ల స్టైలే వేరు.వాళ్లదంతా ఇంటర్నేషనల్ స్టైల్..

అభిమానులకు షడ్రుచుల వంటను ప్రతి రోజు సాయంత్రం వడ్డిస్తున్న ఐపీఎల్ ఆటతో పాటు వినోదాన్ని పంచుతున్నది. బ్యాటర్ల సిక్సర్లు, బౌలర్ల వికెట్లు, ఫీల్డర్ల కళ్లు మిరుమిట్లు గొలిపే క్యాచులు, కళ్లు మూసి తెరిచే లోపలే వికెట్లను గిరాటేసే వికెట్ కీపర్ల స్టంప్ లు.. ఏది చేసినా వేడుకే. వీటన్నింటిలో వికెట్లను తీసినప్పుడు బౌలర్ చేసుకునే వేడుక ప్రత్యేకం. అయితే ఈ వేడుకలలో ఆర్సీబీ బౌలర్ల వేడుకలు మరీ ప్రత్యేకమైనవి. ఈ జట్టు బౌలర్లు దేశవాళీ స్టార్లను వదిలి ఏకంగా అంతర్జాతీయ స్టార్లనే కాపీ కొడుతున్నారు. ఇప్పటిదాకా సిరాజ్ ఒక్కడే అనుకుంటే ఇప్పుడు ఈ జాబితాలో హసరంగ కూడా చేరాడు 

వికెట్ తీశాక సిరాజ్.. దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ‘సూ’ తో హంగామా చేస్తాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా సిరాజ్ ఈ కొత్త స్టైల్ ను అలవాటు చేసుకున్నాడు. ఇక ఇప్పుడు హసరంగ కూడా వికెట్ తీశాక.. మరో ఫుట్బాల్ ప్లేయర్ నైమర్ సెలబ్రేషన్ స్టైల్ న ఐపీఎల్ ఫ్యాన్స్ కు పరిచయం చేశాడు. బుధవారం నాటి మ్యాచులో నాలుగు వికెట్లు తీసుకున్న హసరంగ.. వికెట్ తీసిన ప్రతిసారి ఈ స్టైల్ నే ఫాలో అయ్యాడు. 

Scroll to load tweet…

గోల్ కొట్టిన తర్వాత నైమర్.. తన రెండు చేతులలోని బొటన వేలు, చిటికిన వేలును మాత్రమే తెరిచి చాతి, భుజం తడుముకుంటూ వేడుక చేసుకుంటాడు. ఇప్పుడు ఇదే స్టైల్ ను హసరంగ కాపీ కొట్టాడు. ఇది ఐపీఎల్ అభిమానులతో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటున్నది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

అందుకే అలా చేశా : 

తాజా సెలబ్రేషన్స్ పై హసరంగ స్పందిస్తూ.. ‘మ్యాచులో మేం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కఠిన పరిస్థితులు ఎదుర్కున్నాం. నేను బ్యాటింగ్ లో 4 పరుగులు మాత్రమే చేయగలిగాను. అయితే బౌలింగ్ లో నా ప్రదర్శన పట్ల ఆనందంగా ఉన్నాను. మంచు కురుస్తున్న సమయంలో బౌలింగ్ చేయడం చాలా కష్టం. ఇక నా సెలబ్రేషన్స్ గురించి చెప్పాలంటే.. నేను ఫుట్బాల్ ప్లేయర్ నైమర్ కు వీరాభిమానిని. గోల్ కొట్టిన తర్వాత ఆయన అలాగే వేడుక చేసుకుంటాడు. ఇప్పుడు నేనూ అదే చేశాను..’ అని తెలిపాడు. 

కాగా బుధవారం నాటి మ్యాచులో ముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. 18.5 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయింది. రసెల్ (25) ఒక్కడే టాప్ స్కోరర్. ఆ జట్టులో శ్రేయస్ అయ్యర్ తో పాటు నరైన్, జాక్సన్, సౌథీ వికెట్లను హసరంగ పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ లో ఆర్సీబీ కూడా తడబడింది. 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ.. రూథర్ ఫర్డ్ (27), షాబాజ్ అహ్మద్ (27) లు రాణించడంతో పాటుు ఆఖర్లో దినేశ్ కార్తీక్ (14) ధాటిగా ఆడటంతో ఆ జట్టు విజయం సాధించింది. నాలుగు వికెట్లు తీసిన హసరంగకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్దు దక్కింది.