TATA IPL 2022: ఆ కుర్రాడు తాను కూడా రంజీలు ఆడతానని ఢిల్లీ క్రికెట్ జట్టును సంప్రదించాడు. కానీ ఆ జట్టు మాత్రం ‘నువ్వు ఆటకు పనికిరావు. నీకు ఫిట్నెస్ లేదు పో..’ అని పంపించింది. కానీ ఇప్పుడు ఆ యువకుడే లక్నో తరఫున దుమ్ము దులిపే ప్రదర్శనలు చేస్తున్నాడు.
ఐపీఎల్.. భారత క్రికెట్ ను పోషిస్తున్న కామధేనువే గాక ప్రతి సీజన్ లో కొంత మంది యువ క్రికెటర్లను భారత జట్టుకు అందిస్తున్న ఒక భారీ క్రికెట్ అకాడమీ. ఈ లీగ్ ద్వారా ఎంతోమంది యువకుల ‘జాతీయ జట్టు కలలు’నెరవేరాయి. లీగ్ నుంచి జాతీయ జట్టుకు వెళ్లి విజయవంతమయ్యారా..? లేదా..? అన్న విషయం పక్కనబెడితే చాలా మంది నాణ్యమైన క్రికెటర్లను పరిచయం చేస్తున్నది ఐపీఎల్. ఈ ఏడాది సీజన్ లో ఆ జాబితాలో ముందుస్థానంలో వచ్చే పేరు ఆయుష్ బదోని. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న ఈ కుర్రాడు.. ఆడింది రెండు మ్యాచులే అయినా భవిష్యత్ ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. అయితే మ్యాచులను ముగించగల సమర్థత ఉన్న ఈ ఆటగాడిని ఢిల్లీ జట్టు మాత్రం.. ‘నువ్వు ఆటకు పనికిరావు పో... ’ అని తేల్చేసింది.
ఢిల్లీకి చెందిన ఈ యువ క్రికెటర్.. 2018లో అండర్-19 జట్టులో సభ్యుడు. ఆసియా కప్ లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కొద్దిరోజుల క్రితం రాష్ట్ర రంజీ జట్టు యాజమాన్యంను కలిసి తాను కూడా రంజీలు ఆడతానని అడిగాడు. అయితే అతడిని చూసిన ఢిల్లీ రంజీ జట్టు.. ‘నువ్వు ఆటకు ఫిట్ గా లేవు.. సారీ..’ అని తేల్చింది. అయితే అతడి సామర్థ్యం తెలిసిన విజయ్ దహియా (లక్నో కోచింగ్ సిబ్బందిలో సభ్యుడు) అతడు ఆడిన వీడియోలను గౌతం గంభీర్, కెఎల్ రాహుల్ కు పంపించాడు.
తక్కువ ధరకే ఎక్కువ లాభం..
బదోని లో దాగున్న టాలెంట్ ను గుర్తించిన లక్నో జట్టు.. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ వేలంలో అతడిని కనీస ధర రూ. 20 లక్షలు పెట్టి దక్కించుకుంది. ఆ జట్టు తనపై పెట్టిన నమ్మకాన్ని బదోని వమ్ము చేయలేదు. గుజరాత్ తో జరిగిన తొలి మ్యాచులో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. 41 బంతుల్లోనే 54 పరుగులు చేసి ఆదుకున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్ అయినా ఫినిషర్ పనిచేశాడు బదోని. గుజరాత్ తో అతడు ఆడిన ఇన్నింగ్స్ లో నాలుగు సిక్సర్లు కూడా ఉన్నాయి.
ఆ ఇన్నింగ్స్ చూసి లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ తో పాటు గౌతం గంభీర్ కూడా ముగ్దులై పోయారు. మ్యాచ్ ఓడినా తమకు కూడా మిస్టర్ 360 ప్లేయర్ దొరికాడని సంతోషం వ్యక్తం చేశారు. రాహుల్ తన సోషల్ మీడియా ఖాతాలలో ‘అతడు (బదోని) మా జట్టులో బేబీ ఏబీడీ (డివిలియర్స్) వంటి వాడు. గొప్ప టాలెంట్ ఉంది. భారత్ కు ఆడే సత్తా ఉన్న ఆటగాడు’ అని రాసుకొచ్చాడు.
ఫినిషర్ కూడా..
ఇక గురువారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన హై ఓల్టేజ్ మ్యాచు లో కూడా బదోని రెచ్చిపోయాడు. తొలి మ్యాచులో పరిస్థితులకు తగ్గట్టు నెమ్మదిగా ఆడి తర్వాత రెచ్చిపోయిన ఈ ఢిల్లీ కుర్రాడు.. చెన్నైతో మ్యాచులో తీవ్ర ఒత్తిడిలో 9 బంతుల్లోనే 19 పరుగులు చేసి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఒత్తిడిలో కూడా రెండు భారీ సిక్కర్లు బాదాడు.
ఇంత బాగా ఆడుతున్నాడు కాబట్టే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఆ కుర్రాన్ని జట్టులో చేర్చుకుని రంజీలు ఆడించాలని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ సభ్యుల (డీసీఏ) కు సూచించాడు. కానీ డీసీఏ మాత్రం ద్రావిడ్ సూచనలను పెడచెవిన పెట్టి బదోనిని ‘అన్ ఫిట్’ అని తేల్చింది. అందుకు ఢిల్లీ ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటున్నది. బదోని ఆట చూశాక డీసీఏ బాధ వర్ణనాతీతం.
