IPL2022: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు నికోలస్ పూరన్, స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్ లు ప్రాక్టీస్ సెషన్ లో ఒకరి మీద ఒకరు బెట్ వేసుకున్నారు. ఈ బెట్ లో కాశ్మీర్ పేసర్ దారుణంగా ఓడిపోయాడు.
‘ఈ మ్యాచులో మేమే గెలుస్తాం.. ఎంత పందెం...’, ‘ఈరోజు సచిన్ సెంచరీ కొడతాడు.. పందెమెంతైనా రెడీ..’ ఇలాంటి బెట్ లు మనం కూడా వేసుంటాం. అయితే సాధారణ క్రికెట్ అభిమానులే కాదు.. క్రికెటర్లు కూడా పందేలు కాస్తారు. మరి మనమైతే వందో, వెయ్యో.. మన తాహతుకు తగ్గట్టుగా పందెం కాస్తాం. క్రికెటర్లు ఏం ఫలితం కోరి పందేలు కాస్తారు..? ఐపీఎల్ ద్వారా కోటానుకోట్ల రూపాయలు సంపాదిస్తున్న మన క్రికెటర్లు బెట్ లు గెలిస్తే వచ్చేదెంత...? తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ కు చెందిన ఇద్దరు స్టార్ క్రికెటర్లు కూడా బెట్ వేసుకున్నారు. ఈ బెట్ లో విండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ గెలవగా.. ఉమ్రాన్ మాలిక్ ఓడిపోయాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే... ఈనెల 29న రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచుకు సిద్ధమవుతున్న సన్ రైజర్స్ ఆటగాళ్లు కోచ్ టామ్ మూడీ నేతృత్వంలో ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నికోలస్ పూరన్.. ఉమ్రాన్ మాలిక్ తో ‘నువ్వు తర్వాత బంతిని యార్కర్ వేస్తే నువ్వు ఇవాళ రాత్రి ఎంత తింటే అంత తినిపిస్తా... బెట్ కు ఓకేనా..?’ అని పందెం కాసాడు.
పందేనికి ఒప్పుకున్న ఈ స్పీడ్ స్టర్ బంతిని అందుకుని నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న బ్యాటర్ వైపు విసిరాడు. కానీ అదికాస్తా ఫుల్ టాస్. దీంతో ఉమ్రాన్ మాలిక్ బెట్ ఓడిపోయాడు. ఇందుకు గాను ఫలితంగా పూరన్ కు మాలిక్ డిన్నర్ చేయించాలి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
గతేడాది రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఉమ్రాన్ మాలిక్ ను రూ. 4 కోట్లకు రిటైన్ చేసుకుంది సన్ రైజర్స్. గత సీజన్ లో ఆడింది కొన్ని మ్యాచులే అయినా అతడు బౌలర్ గా తానేంటో నిరూపించుకోవడంతో హైదరాబాద్ అతడిపై నమ్మకముంచింది. గత సీజన్ లో అతడు ఏకంగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసరడం గమనార్హం. 2022 సీజన్ లో కూడా సన్ రైజర్స్ ఉమ్రాన్ పై భారీ ఆశలే పెట్టుకుంది.
ఇక ఇటీవలే ముగిసిన వేలం ప్రక్రియలో రూ. 10.75 కోట్లు వెచ్చించి పూరన్ ను సొంతం చేసుకుంది రైజర్స్. ఈ విండీస్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ మీద కూడా ఎస్ఆర్హెచ్ భారీ ఆశలు పెట్టుకుంది. మరి ఈ ఇద్దరు స్టార్లు హైదరాబాద్ అభిమానుల ఆశలను ఏ మేరకు నిలబెడతారో తెలియాలంటే రేపటి దాకా ఆగాల్సిందే. మంగళవారం సాయంత్రం 7.30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్ తో తలపడనున్న విషయం తెలిసిందే.
