TATA IPL 2022 - SRH vs LSG: లక్నోతో జరుగుతున్న మ్యాచులో పవర్ ప్లేలో మూడు  వికెట్లు తీసిన సన్ రైజర్స్ బౌలర్లు తర్వాత తేలిపోయారు.  మిడిల్ ఓవర్లలో భారీగా పరుగులిచ్చుకున్నారు. కెఎల్ రాహుల్, దీపక్ హుడాలు అర్థ సెంచరీలతో రాణించారు.

ఐపీఎల్-2022 సీజన్ లో రెండో మ్యాచ్ ఆడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ లో మార్పులేమీ లేవు. తొలి మ్యాచ్ లో భారీగా పరుగులిచ్చిన బౌలర్లు.. లక్నోతో మ్యాచ్ లో కూడా తేలిపోయారు. పవర్ ప్లే లో బౌలింగ్ వేసి రెండు వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్ మినహా.. మిగిలిన వాళ్లు పెద్దగా ఆకట్టుకోలేదు. ఆదిలో దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఫలితంగా లక్నో బ్యాటర్లు రెచ్చిపోయి ఆడారు. 27 కే 3 వికెట్లు కోల్పోయి ఆపదలో ఉన్న లక్నోను కెప్టెన్ కెఎల్ రాహుల్ (50 బంతుల్లో 68. 6 ఫోర్లు, 1 సిక్సర్), దీపక్ హుడా (33 బంతుల్లో 51.. 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆదుకున్నారు. దీంతో ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఈ మ్యాచులో గెలవాలంటే సన్ రైజర్స్.. 170 పరుగులు చేయాలి. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన లక్నోకు గొప్ప ఆరంభమేమీ దక్కలేదు. ఇన్నింగ్స్ లో రెండో ఓవర్లోనే ఆ జట్టు ఓపెనర్ క్వింటన్ డికాక్ (1).. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో కెప్టెన్ విలియమ్సన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత ఓవర్లో సుందర్.. ఎవిన్ లూయిస్ (1) కూడా ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. 

అదే ఊపులో సన్ రైజర్స్.. మనీష్ పాండే (10 బంతుల్లో 11.. 1 ఫోర్, 1 సిక్సర్) ను కూడా పెవిలియన్ కు పంపింది. రొమారియో షెఫర్డ్ వేసిన ఇన్నింగ్స్ 4.5 ఓవర్లో.. భువనేశ్వర్ కుమార్ కు క్యాచ్ ఇచ్చి పాండే ఔటయ్యాడు.

ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన దీపక్ హుడా.. వస్తూనే దూకుడుగా ఆడాడు. దీంతో లక్నో స్కోరు జోరందుకుంది. ఉమ్రాన్ మాలిక్ వేసిన 10వ ఓవర్లో ఆ జట్టు ఏకంగా 20 పరుగులు పిండుకుంది. ఆ ఓవర్లో తొలి బంతికి ఫోర్ బాదిన హుడా రెండో బంతికి సింగిల్ తీసి రాహుల్ కు బ్యాటింగ్ ఇచ్చాడు. మూడు, నాలుగు బంతులను ఫోర్లుగా మలిచిన రాహుల్.. ఆరరో బంతికి సిక్సర్ బాదాడు. మళ్లీ అదే ఉమ్రాన్ మాలిక్.. తన 14వ ఓవర్లో 16 పరుగులు సమర్పించుకున్నాడు. కాగా నటరాజన్ వేసిన 15వ ఓవర్లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు హుడా. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే షెఫర్డ్ బౌలింగ్ లో మిడ్ వికెట్ మీద ఫీల్డింగ్ చేస్తున్న త్రిపాఠికి చిక్కాడు. 

Scroll to load tweet…

హుడా నిష్క్రమించిన ఓవర్లోనే మూడో బంతికి సింగిల్ తీసి హాఫ్ సెంచరీ చేరుకున్న రాహుల్.. తర్వాత మరింత రెచ్చిపోయాడు. వాషింగ్టన్ సుందరర్ వేసిన 17వ ఓవర్లో రెండు ఫోర్లు, పిక్సర్ తో 17 పరుగులు పిండుకుంది లక్నో.. భువనేశ్వర్ విసిరిన 18వ ఓవర్లో 7 పరుగులే రాగా.. నటరాజన్ వేసిన 19వ ఓవర్లో రాహుల్, కృనాల్ (6) లు ఔట్ కాగా.. 8 పరుగులు మాత్రమే వచ్చాయి. షెఫర్డ్ చివరి ఓవర్లో 17 పరుగులిచ్చాడు. 

సన్ రైజర్స్ బౌలర్లలో సుందర్, రొమారియా షెఫర్డ్ లతో పాటు బర్త్ డే బాయ్ నటరాజన్ కూడా తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇక ఉమ్రాన్ మాలిక్ స్పీడ్ ను మాత్రమే నమ్ముకుని లెంగ్త్ బంతులు విసరకపోవడంతో లక్నో బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. 3 ఓవర్లలో అతడు ఏకంగా 39 పరుగులిచ్చాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో అతడు వేసిన రెండు, మూడు బంతులు 151 కిలోమీటర్ల వేగంతో విసిరాడు.