TATA IPL2022 RR vs MI: ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచులో ఇంగ్లాండ్ క్రికెటర్  జోస్ బట్లర్  సెంచరీ చేశాడు. 2022 సీజన్ లో సెంచరీ  చేసిన తొలి ఆటగాడు అతడే.  మరీ ముంబై బౌలర్లకు బట్లర్ బ్యాటింగ్ కు వస్తే బడిత పూజే..

ఐపీఎల్-2022 సీజన్ లో తొలి సెంచరీ నమోదుచేశాడు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్. ముంబై ఇండియన్స్ పై డాక్టర్ డీవై పాటిల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో బట్లర్.. ఆ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి చివరి దాకా ముంబై బౌలర్లకు బడిత పూజె.. 66 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన బట్లర్ కు ముంబై జట్టు అంటే మహా ఇష్టం. మిగతా జట్లమీద ఎలా ఆడినా ముంబై పై మాత్రం దుమ్ముదులుపుతాడు.

2018 సీజన్ నుంచి నేటి వరకు రాజస్థాన్ తో ఆడుతూ ముంబై ప్రత్యర్థిగా బట్లర్ మొత్తం 7 మ్యాచులాడాడు. ఆరు ఇన్నింగ్స్ లలో అతడు ఏకంగా 400 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 100 కాగా 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ముంబైపై గడిచిన నాలుగు ఇన్నింగ్స్ లలో బట్లర్ 100, 89, 70, 41.. జోరు కొనసాగిస్తున్నాడు. ఆ జట్టుపై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బట్లర్ బ్యాటింగ్ సగటు 80గా ఉండగా స్ట్రైక్ రేట్ 161 గా ఉండటం గమనార్హం. 

రెండు సెంచరీలు చేసిన రెండో ఇంగ్లీష్ ప్లేయర్.. 

ఐపీఎల్ లో రెండు సెంచరీలు సాధించిన రెండో ఇంగ్లాండ్ క్రికెటర్ గా బట్లర్ రికార్డులకెక్కాడు. గతంలో ఈ జాబితాలో బెన్ స్టోక్స్ (2017లో గుజరాత్ లయన్స్ పై 103 నాటౌట్, 2020లో ముంబై పై 107 నాటౌట్) ఉన్నాడు. ఇక ఈ జాబితాలో బట్లర్ (2021 సీజన్ లో ఎస్ఆర్హెచ్ పై 124, 2022 లో ముంబైపై 100) ఉన్నాడు. మొత్తంగా ఐపీఎల్ లో సెంచరీలు సాధించిన ఇంగ్లీష్ క్రికెటర్లు.. కెవిన్ పీటర్సన్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, బెయిర్ స్టో.. 

Scroll to load tweet…

రెండు లేదా ఎక్కువ సెంచరీలు సాధించిన ఓవర్సీస్ ఆటగాళ్లు.. 

- క్రిస్ గేల్, ఆడమ్ గిల్ క్రిస్ట్, డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్, ఏబీ డివిలియర్స్, బ్రెండన్ మెక్ కల్లమ్ , బెన్ స్టోక్స్, హషీమ్ ఆమ్లా, జోస్ బట్లర్ 

Scroll to load tweet…

ఇదిలాఉండగా.. ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. బట్లర్ సెంచరీతో పాటు సామ్సన్ (30), హెట్మెయర్ (35) లు విజృంభించి ఆడారు.