TATA IPL 2022: ఐపీఎల్-15లో ఇప్పటికే ఆయా జట్లు ఒక మ్యాచ్ ఆడేశాయి. అయితే పలు కారణాల రీత్యా అందుబాటులో లేని ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే ఫ్రాంచైజీలతో కలుస్తున్నారు. పంజాబ్ కింగ్స్ కు సిక్సర్ల వీరుడు జానీ భాయ్ ఆ జట్టుతో కలిశాడు. కొత్తల్లుడు గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ముంబై ఫ్లైట్ ఎక్కనున్నాడు.
ఐపీఎల్ ప్రారంభ మ్యాచులకు దూరంగా ఉన్న పలువురు విదేశీ ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే ముంబైకి చేరుకుంటున్నారు. ఐపీఎల్ లో ఈ సీజన్ నుంచి పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో.. వెస్టిండీస్ పర్యటన ముగించుకుని ముంబైకి చేరుకున్నాడు. ప్రస్తుతం అతడు నిబంధనల ప్రకారం వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంది. రేపు (ఏప్రిల్) 1న ఆ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచుకు బెయిర్ స్టో అందుబాటులో లేకపోయినా తర్వాత జరిగే మ్యాచులతో పంజాబ్ తో కలిసే అవకాశముంది.
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ టెస్టు జట్టులో సభ్యుడైన బెయిర్ స్టో.. ఆ బాధ్యతలు ముగించుకుని బుధవారం రాత్రి ముంబైకి చేరుకున్నాడు. అనంతరం అతడు నేరుగా పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ కు చేరుకుని క్వారంటైన్ అయ్యాడు. గత 3 సీజన్ల పాటు సన్ రైజర్స్ తరఫున ఆడిన బెయిర్ స్టో ను ఈసారి పంజాబ్.. 6.75 కోట్లు పెట్టి దక్కించుకుంది.
సూర్య భాయ్ కూడా రె‘ఢీ’..
టీమిండియా మిస్టర్ 360, ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ గాయం నుంచి కోలుకుని తర్వాత మ్యచులకు సిద్ధమవుతున్నాడు. ఇటీవలే జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) నుంచి ముంబైతో చేరిన సూర్య.. క్వారంటైన్ కూడా ముగించుకున్నాడు. అతడిప్పుడు జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు. ఏప్రిల్ 2న రాజస్థాన్ తో జరుగబోయే మ్యాచులో మిస్టర్ 360 ఆడే అవకాశమున్నట్టు ముంబై వర్గాలు తెలిపాయి.
కొత్త పెళ్లి కొడుకు మ్యాక్స్వెల్..
భారత సంతతికి చెందిన అమ్మాయి వినీ రామన్ ను ఈనెల 18న పెండ్లాడిన ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా వీలైనంత త్వరగా ఇండియాకు రావాలని కోరుకుంటున్నాడు. తన సతీమణి వినీ తో కలిసి ఇండియాకు వస్తున్నట్టు అతడు ఇటీవల తన ట్విట్ఱర్ ఖాతాలో హింట్ఇచ్చాడు. ఇండియాకు వస్తున్నానని చెప్పకనే చెబుతూ పాస్ పోర్ట్, వీసా ఫోటోలను షేర్ చేశాడు.
ఆసీస్ పొమ్మంది.. ఢిల్లీ రమ్మంది..
ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కూడా ఐపీఎల్ లో తన ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ తో త్వరలో కలువనున్నాడు. పాకిస్తాన్ తో వన్ేడ సిరీస్ కు దూరమై (గాయం కారణంగా)న అతడు.. ఆసీస్ కు వెళ్లకుండా నేరుగా భారత్ కు రానున్నాడు. అతడు ఇక్కడ ఢిల్లీ వైద్య బృంద పర్యవేక్షణలో చికిత్స తీసుకుని తర్వాత ఫ్రాంచైజీతో కలిసే అవకాశముంది.
