TATA IPL 2022 - SRH vs LSG:  సీజన్ లో తొలి గెలుపు దక్కించుకోవాలని ఆరాటపడ్డ సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరోసారి నిరాశే ఎదురైంది. లక్నోతో ముగిసిన మ్యాచులో  కేన్ విలియమ్సన్ సారథ్యంలోని హైదరాబాద్.. 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 

ఐపీఎల్-2022 సీజన్ ను ఓటమితో ప్రారంభించిన సన్ రైజర్స్ హైదారబాద్.. రెండో మ్యాచ్ లో కూడా దానినే కొనసాగించింది. తొలుత లక్నోను 169 పరుగులకే కట్టడి చేసిన హైదరాబాద్.. తర్వాత మోస్తారు లక్ష్య ఛేదనలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బ్యాటింగ్ లో భారీ ఆశలు పెట్టుకున్న కెప్టెన్ విలియమ్సన్, ఏయిడిన్ మార్క్రమ్ లు తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. నికోలస్ పూరన్ పోరాడినా ఆ పోరాటం హైదరాబాద్ కు విజయాన్ని అందించలేదు. ఈ సీజన్ లో వరుసగా రెండో మ్యాచులో టాస్ గెలిచి సైతం ఓటమి అందుకుంది సన్ రైజర్స్. ఇక లక్నోకు ఇది వరుసగా రెండో విజయం.

లక్ష్య ఛేదనలో తడబడుతూనే ఇన్నింగ్స్ ప్రారంభించింది సన్ రైజర్స్. ఎదుర్కున్న 16 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో 16 పరుగులు చేసిన కేన్ మామ.. అవేశ్ ఖాన్ వేసిన 3.3 ఓవర్ల స్కూప్ షాట్ ఆడబోయ ఆండ్రూ టైకి చిక్కాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (13) కూడా అవేశ్ ఖాన్ బౌలింగ్ లోనే భారీ షాట్ కు యత్నించి.. పాండేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన రాహుల్ త్రిపాఠి (30 బంతుల్లో 44. 5 ఫోర్లు, 1 సిక్సర్) లక్నో బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. మార్క్రమ్ (12) తో కలిసి మూడో వికెట్ కు 44 పరుగులు జోడించాడు. అయితే స్పిన్ ఆడటంలో ఇబ్బంది పడ్డ మార్క్రమ్ ను ఇన్నింగ్స్ పదో ఓవర్లో కృనాల్ పాండ్యా ఔట్ చేశాడు. 

Scroll to load tweet…

14వ ఓవర్లో కృనాల్ సన్ రైజర్స్ కు మరో షాకిచ్చాడు. హాఫ్ సెంచరీ వైపునకు దూసుకుపోతున్న రాహుల్ త్రిపాఠిని ఔట్ చేశాడు. పాండ్యా వేసిన స్లో డెలివరీని స్లాగ్ స్వీప్ ఆడబోయిన త్రిపాఠి.. డీప్ మిడ్ వికెట్ వద్ద ఉన్న రవి బిష్ణోయ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికీ సన్ రైజర్స్ స్కోరు 95-4గా ఉంది.

ఆ క్రమంలో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (24 బంతుల్లో 34.. 3 ఫోర్లు, 2 సిక్సర్లు), వాషింగ్టన్ సుందర్ (14 బంతుల్లో 18) తో కలిసి ధాటిగా ఆడారు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు 48 పరుగుల భాగస్వామ్యం జోడించారు. కృనాల్ వేసిన 14వ ఓవర్లో సిక్సర్ బాదిన పూరన్ 15వ ఓవర్ వేసిన హోల్డర్ బౌలింగ్ లో రెండు ఫోర్ల సాయంతో 15 పరగులు రాబట్టాడు. అయితే 17వ ఓవర్ వేసిన అవేశ్ ఖాన్ బౌలింగ్ లో తొలి బంతికి సిక్సర్ బాదిన పూరన్.. మూడో బంతికి లాంగాఫ్ లో ఉన్న హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే ఓవర్లో తర్వాత బంతికి అవేశ్.. అబ్దుల్ సమద్(0) ను డకౌట్ చేశాడు. 

ఇక 19వ ఓవర్ వేసిన ఆండ్రూ టై ఓవర్లో పది పరుగులు వచ్చాయి. దీంతో సమీకరణం 6 బంతుల్లో 16 పరగులుగా మారింది.కానీ జేసన్ హోల్డర్ వేసిన ఆఖరి ఓవర్లో.. తొలి బంతికే వాషింగ్టన్ సుందర్ భారీ షాట్ కు యత్నించి కెఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వా ఐదు బంతుల్లో 3 పరుగులే వచ్చాయి. హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయింది. ఫలితంగా 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 

లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్.. 4 ఓవర్లు వేసి 23 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కృనాల్ పాండ్యా 2 వికెట్లు దక్కించుకున్నాడు. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆ జట్టు సారథి కెఎల్ రాహుల్ (63), దీపక్ హుడా (51), ఆయుష్ బదోని (19) లు రాణించారు. సన్ రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రొమారియా షెఫర్డ్, టి. నటరాజన్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.