TATA IPL 2022: టీమిండియా గబ్బర్ సింగ్ గా గుర్తింపు దక్కించుకున్న శిఖర్ ధావన్ ఇటీవలే ఆయేషా ముఖర్జీ తో 8 ఏండ్ల వివాహ బంధానికి వీడ్కోలు చెప్పాడు. అయితే అంతకుముందే ఈ ఢిల్లీ ఆటగాడికి ఓ లవ్ స్టోరీ ఉందట..
వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ ఇటీవలే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి తిరిగి ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతూ అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు. అయితే కొద్దికాలం క్రితమే మన గబ్బర్ సింగ్.. ఎనిమిదేండ్ల పాటు వివాహ బంధంలో ఉన్న అయేషా ముఖర్జీ తో విడాకులు కూడా తీసుకున్న విషయం తెలిసిందే. పెళ్లికి ముందే శిఖర్ ధావన్ కు ఓ బ్రేకప్ లవ్ స్టోరీ కూడా ఉందట. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఆమె ధావన్ ప్రేమను అంగీకరించలేదట. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు.
పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ వీడియోలో శిఖర్ ఈ కామెంట్స్ చేశాడు. తాను క్రికెట్ ఆడే కొత్తలో ఒక అమ్మాయిని తెగ ఇష్టపడ్డానని, ఆ అమ్మాయికి ప్రపోజ్ కూడా చేశానని చెప్పుకొచ్చాడు. అయితే ఆ అమ్మాయి మాత్రం ధావన్ ను రిజెక్ట్ చేసిందట. అప్పుడు ధావన్ ఆమెతో.. ‘నువ్వు కోహినూర్ వజ్రాన్ని కోల్పోతున్నావ్.. నీకు అర్థం కాట్లేదు..’ అని భారీ డైలాగ్ కొట్టి వచ్చాడట. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన బ్రేకప్ స్టోరీతో పాటు ధావన్ ఈ వీడియోలో పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తో గతంలో ఆడాడు. గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడిన గబ్బర్.. ఈసారి పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ లో పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో గబ్బర్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. పంజాబ్ ఆడిన మూడు మ్యాచులలో పాల్గొన్న ధావన్.. 92 పరుగులు సాధించాడు. తొలి స్థానంలో లియామ్ లివింగ్ స్టోన్ (98) ఉన్నాడు. పంజాబ్ తన తర్వాత మ్యాచును ఈనెల 8న గుజరాత్ టైటాన్స్ తో ఆడనున్నది.
కాగా.. 2012లో అప్పటికే పెళ్లై ఇద్దరు కూతుర్లు ఉన్న అయేషా ముఖర్జీని శిఖర్ పెళ్లి చేసుకున్నాడు. 2014లో వీరికి కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఏడేండ్లున్న ఆ అబ్బాయి పేరు జోరవర్. అయితే ఇటీవలే ధావన్-అయేషా లు విడాకులు తీసుకున్నారు. బెంగాల్ కు చెందిన అయేషా... 8 ఏండ్ల వయసులోనే ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడ కిక్ బాక్సర్ గా శిక్షణ తీసుకుంది.
