TATA IPL 2022 Live Updates: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఇటీవలే తన చిరకాల స్నేహితురాలు వినీ రామన్ ను పెళ్లి చేసుకుని ఇండియాకు వచ్చాడు. భార్యతో కలిసి వచ్చిన కొత్త పెళ్లికొడుకుకు కోహ్లి మసాజ్ చేశాడు.
రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మంగళవారం జరిగిన మ్యాచులో ఫలితం సంగతి కాస్త పక్కనబెడితే మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆర్సీబీ ఆల్ రౌండర్, రిటెన్షన్ లో ఆ జట్టు ఏరికోరి సెలెక్ట్ చేసుకున్న గ్లెన్ మ్యాక్స్వెల్ ఇటీవలే ఆ జట్టుతో చేరాడు. మంగళవారం నాటి మ్యాచ్ కు అతడు ఫిట్ గా ఉన్నా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిబంధనల కారణంగా మ్యాక్సీ ఆడలేదు. అయితే మ్యాచ్ లో భాగంగా బెంగళూరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లి.. మ్యాక్స్వెల్ కు మసాజ్ చేస్తూ కనిపించాడు.
ఆర్సీబీ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో దినేశ్ కార్తీక్ సంచలన షాట్లతో అలరిస్తున్న సందర్భంలో కెమెరామెన్ల కన్ను ఆ జట్టు డగౌట్ వైపునకు మళ్లింది. అక్కడ నుంచి మ్యాచ్ చూస్తున్న విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ లు కార్తీక్ బ్యాటింగ్ ను ఎంజాయి చేస్తుండగా అక్కడ ఈ ఆసక్తకిర సన్నివేశం చోటు చేసుకుంది.
దినేశ్ కార్తీక్ సిక్సర్ కొట్టగానే.. కోహ్లి తన ముందు కూర్చున్న మ్యాక్స్వెల్ వీపు మీద నొక్కుతూ కనిపించాడు. హాయిగా అనిపించేందేమో గానీ.. కోహ్లి ని మరికొంత సేపు మసాజ్ చేయాలని కోరాడు మ్యాక్సీ. కాసేపు భుజాలు, వీపును గట్టిగా నొక్కుతుంటే స్వర్గంలో తేలిపోయాడు కొత్త పెళ్లికొడుకు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఇటీవలే వినీ రామన్ ను పెళ్లి చేసుకున్న మ్యాక్సీ.. తన భార్యతో కలిసి ముంబైకి వచ్చాడు. ప్రస్తుతం భార్యతో కలిసి హోటల్ లో ఉంటున్న మ్యాక్సీ రాక సందర్భంగా ఆర్సీబీ జట్టు కూడా అతడి కోసం ప్రత్యేకంగా బెడ్ అలంకరించి కొత్త పెళ్లి కొడుకుకు ఘనంగా స్వాగతం పలికింది. పెళ్లి కోసమే మ్యాక్సీ.. ప్రతిష్టాత్మక పాకిస్థాన్ సిరీస్ ను కూడా వదులుకున్నాడు. ఇక ‘ఐపీఎల్ తో పాటు హనీమూన్ కూడా ఎంజాయ్ చేస్తున్న మ్యాక్సీకి రాత్రంతా నిద్ర లేనట్టుంది.. కోహ్లి భయ్యా.. కొత్త పెళ్లికొడుకుకు కాస్త గట్టిగా మసాజ్ చేయండి...’ అని ఈ పోస్టు కింద కామెంట్లు పెడుతున్నారు బెంగళూరు అభిమానులు. రాజస్థాన్ తో మ్యాచ్ కు అందుబాటులో లేని మ్యాక్సీ.. ఈనెల 9న ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ లో మాత్రం ఆడే అవకాశాలున్నాయి.
కాగా మంగళవారం నాటి మ్యాచులో రాజస్థాన్ నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు మరో 5 బంతులు మిగిలుండగానే ఛేదించింది. లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి శుభారంభమే దక్కింది గానీ మిడిలార్డర్ తడబడింది. కోహ్లి విఫలమయ్యాడు. కానీ ఆఖర్లో వచ్చిన షాబాజ్ అహ్మద్ (45), దినేశ్ కార్తీక్ (44 నాటౌట్) లు మెరుపు ఇన్నింగ్స్ ఆడి బెంగళూరుకు గెలుపును అందించారు. ఈ సీజన్ లో 3 మ్యాచులాడిన బెంగళూరుకు ఇది రెండో విజయం కాగా.. రాజస్థాన్ కు తొలి పరాజయం.
