TATA IPL 2022- SRH vs LSG: ఈ సీజన్ లో టాస్ గెలిచి కూడా మ్యాచ్ ఓడిన తొలి జట్టుగా అపప్రదను మూటగట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. రెండో మ్యాచులో అయినా విజయం సాధించాలని కోరుకుంటున్నది.
మిగతా జట్లలా హడావిడి లేదు. సోషల్ మీడియాలో హంగూ ఆర్భాటం లేదు. పోనీ చడీ చప్పుడు కాకుండా పని చేసుకుపోతుందా..? అంటే అదీ లేదు. గత సీజన్ తాలూకూ అపజయాలనే రిపీట్ చేస్తూ ఈ సీజన్ ను ఓటమితో ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్.. తమ రెండో మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఐపీఎల్-2022 సీజన్ లో సన్ రైజర్స్ కు ఇది రెండో మ్యాచ్ కాగా.. లక్నోకు మూడో మ్యాచ్. తొలి మ్యాచ్ లో టాస్ గెలిచి మ్యాచ్ ఓడిన జట్టుగా అపప్రద మూటగట్టుకున్న కేన్ విలియమ్సన్ సేన.. ఈ మ్యాచులో ఏం చేస్తుందో చూడాలి మరి. ఈ మ్యాచులో ఎస్ఆర్హెచ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నో బ్యాటింగ్ కు రానుంది.
ముంబైలోని డీవై పాటిల్ వేదికగా జరుగుతున్న మ్యాచులో విజయాన్ని సాధించి సీజన్ లో ముందంజ వేయాలని రైజర్స్ భావిస్తున్నది. అయితే ఆ జట్టుకు బ్యాటింగ్ పెద్ద మైనస్. గత మ్యాచులో (రాజస్థాన్ రాయల్స్ తో) విలియమ్సన్ వివాదాస్పద ఔట్ తర్వాత ప్రధాన బ్యాటర్లంతా రాజస్థాన్ బౌలర్లకు దాసోహమయ్యారు.
వేలంలో భారీ ధర వెచ్చించి దక్కించుకున్న నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్ లతో పాటు మార్క్రమ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠిలు రాణించాలని హైదరాబాద్ కోరుకుంటున్నది. ప్రపంచ స్థాయి మేటి బౌలర్లు డేల్ స్టెయిన్, ముత్తయ్య మురళీధరన్ వంటి ఆటగాళ్లు కోచ్ లుగా ఉన్నా.. హైదరాబాద్ బౌలర్లు గత మ్యాచులో ధారాళంగా పరుగులిచ్చారు. ఈ మ్యాచులో అయినా వాళ్లు నిలకడగా రాణిస్తేనే మ్యాచ్ లో గట్టెక్కుతామని హైదరాబాద్ అభిమానులు భావిస్తున్నారు.
ఇక లక్నో విషయానికొస్తే.. తొలి మ్యాచులో గుజరాత్ తో ఓడినా తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచులో మాత్రం భారీస్కోరు ను ఛేదించి విజయానందంలో ఉంది. కెఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా తో పాటు కొత్త కుర్రాడు ఆయుష్ బదోని మంచి టచ్ లో ఉన్నారు.
ఇక బౌలింగ్ లో ఆ జట్టు బౌలర్లు అవేశ్ ఖాన్ ఇంతవరకు తన మార్క్ చూపించలేదు. కానీ స్పిన్నర్ రవి బిష్ణోయ్ రాణిస్తున్నాడు. ఇప్పుడు ఆ జట్టుకు విండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ కూడా జతకలిశాడు.
తుది జట్లు :
లక్నో సూపర్ జెయింట్స్ : కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, మనీష్ పాండే, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జేసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్
సన్ రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, మార్క్రమ్,, అబ్దుల్ సమద్, రొమారియో షెఫర్డ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
