TATA IPL 2022 DC vs SRH: తొలుత రెండు పరాజయాలు ఎదురైనా తర్వాత వరుస 5 విజయాలతో  ఆకట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్..  గత రెండు మ్యాచులలో మళ్లీ పరాజయాల బాట పట్టింది. ప్లేఆఫ్స్ కోసం జరుగుతున్న పోరులో నేడు ఢిల్లీతో తడబడుతున్నది. 

ఐపీఎల్-2022లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మరో ఆసక్తికర పోరు జరుగబోతున్నది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ రెండు జట్లకు ముఖ్యమే. వరుసగా ఐదు మ్యాచులు గెలిచి తర్వాత మళ్లీ రెండింటిలో ఓడిన సన్ రైజర్స్.. తిరిగి ఈ మ్యాచ్ తో అయినా విజయం సాధించాలని భావిస్తున్నది. ఇక ఇప్పటికే ఐదు మ్యాచులు ఓడిన ఢిల్లీ.. ఇకపై ఆడబోయే ప్రతి మ్యాచ్ లో గెలిస్తేనే ప్లేఆఫ్ చేరే అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో ముంబై లోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల మధ్య కీలక పోరు జరుగనున్నది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

పాయింట్ల పట్టికలో హైదరాబాద్ ఐదో స్థానం (9 మ్యాచులు.. 5 విజయాలు.. 4 ఓటములు.. 10 పాయింట్లు)లో ఉండగా ఢిల్లీ (9 మ్యాచులు.. 4 విజయాలు.. 5 అపజయాలు.. 8 పాయింట్లు) ఏడో స్థానంలో ఉంది. ప్లేఆఫ్ చేరాలంటే ఢిల్లీ తాను ఆడబోయే ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్.. తాను ఆడబోయే 5 మ్యాచులలో కనీసం నాలుగు గెలిచినా చాలు. 

సన్ రైజర్స్ హైదరాాబాద్ జట్టులో మూడు మార్పులు జరగగా.. ఢిల్లీ క్యాపిటల్స్ లో నాలుగు మార్పులతో బరిలోకి దిగుతున్నది. హైదరాబాద్ తరఫున కార్తీక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, సీన్ అబాట్ బరిలోకి దిగుతుండగా.. ఆన్రిచ్ నోర్త్జ్, మన్దీప్ సింగ్, రిపల్ పటేల్, ఖలీల్ అహ్మద్ ఆడుతున్నారు. 

డేవిడ్ వార్నర్ పైనే కళ్లన్నీ.. 

సుమారు ఆరేండ్ల పాటు సన్ రైజర్స్ తరఫున ఆడి అనంతరం అనూహ్య పరిస్థితుల్లో హైదరాబాద్ ను వీడి ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న వార్నర్ మీదే అందరి కళ్లూ ఉన్నాయి. తనను అవమానించి జట్టు నుంచి వెళ్లిపోయేలా చేసిన తన పాత జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నేటి ఢిల్లీ-హైదరాబాద్ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. 

హైదరాబాద్ వరుసగా ఐదు మ్యాచులు గెలవడానికి కీలక పాత్ర పోషించిన సన్ రైజర్స్ బౌలర్లు.. గత రెండు మ్యాచులలో మాత్రం ప్రభావం చూపడం లేదు. బ్యాటింగ్ లో కాస్త మెరుగైన ఎస్ఆర్హెచ్.. ఈ మ్యాచ్ లో తిరిగి బౌలింగ్ గాడిన పడాలని చూస్తున్నది. 

ముఖాముఖి : ఇరు జట్లు ఇప్పటివరకు 9 సార్లు తలపడ్డాయి. ఇందులో హైదరాబాద్ దే 5 సార్లు విజయం. నాలుగు మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది.

తుది జట్లు : 

సన్ రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, సీన్‌ అబాట్‌, భువనేశ్వర్ కుమార్, శ్రేయస్ గోపాల్, కార్తీక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్

ఢిల్లీ క్యాపిటల్స్:డేవిడ్ వార్నర్, మన్దీప్ సింగ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్‌), లలిత్ యాదవ్, రోవ్మన్ పావెల్, రిపల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఆన్రిచ్ నోర్త్జ్, ఖలీల్ అహ్మద్