TATA IPL 2022 - GT vs CSK: గతేడాది అత్యద్భుత ఆటతీరుతో ప్రత్యర్థులపై శివతాండవం చేసిన  చెన్నై సూపర్ కింగ్స్ యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్టకేలకు ఈ సీజన్ లో ఫామ్ లోకి వచ్చాడు. అతడి సూపర్ ఆటతో చెన్నై నిర్ణీత ఓవర్లలో 169 పరుగులు చేసింది. 

0, 1, 1, 16, 17.. గతేడాది ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్ లో గుజరాత్ తో మ్యాచ్ కు ముందు (మొత్తం 35) చేసిన పరుగులవి. చెత్త ఆటతీరుతో వరుసగా ఐదు మ్యాచుల్లో విఫలమై విమర్శలు ఎదుర్కున్న రుతురాజ్ గుజరాత్ తో మాత్రం రెచ్చిపోయి ఆడాడు. పోయిన ఫామ్ ను అందుకుంటూ.. పూణేలో జరుగుతున్న మ్యాచ్ లో 48 బంతుల్లో 73 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 5 భారీ సిక్సర్లున్నాయి. గైక్వాడ్ విజృంభణతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గత మ్యాచ్ లో సిక్సర్లు, ఫోర్లతో దుమ్ము రేపిన రాబిన్ ఉతప్ప, శివమ్ దూబే నేటి మ్యాచ్ లో విఫలమయ్యారు. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఆశించిన ఆరంభమేమీ దక్కలేదు. బెంగళూరుతో జరిగిన గత మ్యాచులో వీర బాదుడు బాదిన రాబిన్ ఊతప్ప ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు. 10 బంతులాడిన అతడు 3 పరుగులకే వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మోయిన్ అలీ (1) కూడా అలా వచ్చి ఇలా వెళ్లాడు. దీంతో 5.2 ఓవర్లలో సీఎస్కే 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. 

రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు (31 బంతుల్లో 46.. 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తో రుతురాజ్ గైక్వాడ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గత ఐదు మ్యాచులలో వరుసగా విఫలమవుతూ విమర్శలు ఎదుర్కుంటున్న ఈ మహారాష్ట్ర కుర్రాడు.. ఈ మ్యాచ్ లో మాత్రం పట్టుదలగా ఆడాడు. తొలుత నెమ్మదిగా ఆడిన రుతురాజ్.. తర్వాత గేర్ పెంచాడు. పది ఓవర్లకు చెన్నై చేసిన స్కోరు 2 వికెట్ల నష్టానికి 66 పరుగులే. 

Scroll to load tweet…

అల్జారీ జోసెఫ్ వేసిన 11వ ఓవర్లో గైక్వాడ్, రాయుడులు తలో సిక్సర్ బాదారు. 12వ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసిన గైక్వాడ్.. ఈ ఐపీఎల్ లో తొలి అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత గైక్వాడ్ మరింత రెచ్చిపోయాడు. దయాల్ వేసిన అదే ఓవర్లో సిక్సర్ బాది స్కోరు వేగాన్ని పెంచాడు. రాయుడు కూడా బ్యాట్ కు పనిచెప్పాడు. ఇక ఫెర్గూసన్ వేసిన 13వ ఓవర్లో ఓ సిక్సర్ తో పాటు బౌండరీ బాదాడు గైక్వాడ్. రషీద్ ఖాన్ వేసిన 14వ ఓవర్లో సిక్సర్ బాదిన రాయుడు.. తర్వాత ఓవర్ వేసిన అల్జారీ జోసెఫ్ బౌలింగ్ లో విజయ్ శంకర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే క్రమంలో 16 వ ఓవర్ (యశ్ దయాల్) రెండో బంతికి గైక్వాడ్ కూడా ఔటయ్యాడు. అప్పటికీ చెన్నై స్కోరు 131 పరుగులే.. 

ఇక ఆఖర్లో శివమ్ దూబే (17 బంతుల్లో 19 నాటౌట్.. 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా (12 బంతుల్లో 22 నాటౌట్. 2 సిక్సర్లు) లు బ్యాట్ ఝుళిపించడానికి ప్రయత్నించినా గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగల రాక గగనమైంది. 15వ ఓవర్లో ఒక్క పరుగు రాగా, 16 వ ఓవర్లో 4, 17వ ఓవర్లో 6, 18వ ఓవర్లో 10, 19వ ఓవర్లో 6 రన్స్ మాత్రమే వచ్చాయి. చివరి ఓవర్లో జడ్డూ రెండు సిక్సర్లు కొట్టాడు. గుజరాత్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ కు రెండు వికెట్లు దక్కాయి.