TATA IPL 2022 - RCB vs RR: రాజస్థాన్ రాయల్స్ కూడా ఐపీఎల్ ట్రెండ్ ఫాలో అయింది. టాస్ ఓడినా వరుసగా రెండు మ్యాచులు గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆ జట్టు.. మూడో మ్యాచులో మాత్రం చేతులెత్తేసింది. లక్ష్య ఛేదనలో ముందు తడబడిన ఆ జట్టు ను షాబాజ్ అహ్మద్ పోటీలోకి తీసుకురాగా.. దినేశ్ కార్తీక్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
వరుసగా రెండు మ్యాచులలో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కు సీజన్ లో తొలి ఓటమి ఎదురైంది. టాస్ ఓడినా రెండు మ్యాచులు గెలిచి చూపించిన రాజస్థాన్ కూడా ట్రెండ్ ఫాలో అయింది. ముందు ఆ జట్టును బౌలింగ్ లో కట్టడి చేసిన బెంగళూరు.. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ లో తడబడినా.. తర్వాత దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 44.. 7 బౌండరీలు, 1 సిక్సర్) కమాల్ ఇన్నింగ్స్ కు తోడు షాబాజ్ అహ్మద్ (26 బంతుల్లో 45.. 4 బౌండరీలు, 3 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. మిడిల్ ఓవర్లలలో వరుస వికెట్లు తీసి బెంగళూరు పై ఒత్తిడి పెంచిన రాజస్థాన్ బౌలర్లు ఆఖర్లో మాత్రం తేలిపోయారు. రాజస్థాన్ నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు.. మరో 5 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఇది బెంగళూరుకు వరుసగా రెండో గెలుపు కాగా.. రాజస్థాన్ కు తొలి ఓటమి.
మోస్తారు లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఇన్నింగ్స్ ధాటిగానే ప్రారంభమైంది. ఓపెనర్లుగా వచ్చిన ఫాఫ్ డుప్లెసిస్ (20 బంతుల్లో 29.. 5 ఫోర్లు), అనూజ్ రావత్ (25 బంతుల్లో 26.. 4 ఫోర్లు) నిలకడగా ఆడారు. తొలి వికెట్ కు వీళ్లిద్దరూ 55 పరుగులు జోడించింది. అయితే చాహల్ ఈ జంటను విడదీశాడు. చాహల్ వేసిన ఏడో ఓవర్లో ఆఖరు బంతికి డుప్లెసిస్.. బౌల్ట్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఆ తర్వాత ఓవర్ వేసిన నవదీప్ సైనీ.. అనూజ్ రావత్ ను ఔట్ చేశాడు. ఈ క్రమంలో యుజ్వేంద్ర చాహల్.. బెంగళూరునకు బ్యాక్ టు బ్యాక్ షాకులిచ్చాడు. 8వ ఓవర్ వేసిన చాహల్.. వరుస బంతుల్లో విరాట్ కోహ్లి (5), డేవిడ్ విల్లీలను ఔట్ చేశాడు.
6 బంతుల్లో 5 పరుగులు చేసిన కోహ్లి.. లేని పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. తర్వాత బంతికే విల్లీని చాహల్ బౌల్డ్ చేశాడు. దీంతో 54 పరుగులకు వికెట్ కోల్పోకుండా ఉన్న ఆర్సీబీ.. 62 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే.. రూథర్ఫర్డ్ (10 బంతుల్లో 5) కూడా క్రీజులో నిలవడానికే ఇబ్బందులు పడ్డాడు.
ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన దినేశ్ కార్తీక్.. షాబాజ్ అహ్మద్ తో కలిసి దూకుడుగా ఆడాడు. అశ్విన్ వేసిన 14వ ఓవర్లో ఓ సిక్సర్ తో పాటు రెండు ఫోర్లు బాదిన కార్తీక్.. నవదీప్ సైనీ వేసిన 15వ ఓవర్లో వరుస బంతుల్లో రెండు ఫోర్లు బాదాడు. ఆ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. అనంతరం ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 16వ ఓవర్లో.. 13 పరగులు రాబట్టారు. అయితే 17వ ఓవర్ వేసిన చాహల్ మాత్రం నాలుగు పరుగులే ఇచ్చాడు.
ఇక 18వ ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో ఓ ఫోర్, సిక్సర్ బాదాడు షాబాజ్. కానీ ఐదో బంతికి బౌల్డ్ అయ్యాడు. అయినా ఆ ఓవర్లో 13 పరగులొచ్చాయి. దీంతో 67 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక చివరి రెండు ఓవర్లలో 15 పరగులు అవసరమవగా.. కార్తీక్, హర్షల్ పటేల్ (9 నాటౌట్) లు కలిసి మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు.
అంతుకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నెమ్మదిగా ఆడింది. బెంగళూరు బౌలర్లు కట్టడి చేయడంతో ఆ జట్టు చివరి పవర్ ప్లే వరకు తడబడింది. అయితే ఆఖరి 2 ఓవర్లలో బ్యాట్ ఝుళిపించి మోస్తారు టార్గెట్ ను బెంగళూరు ముందు నిలపింది. రాజస్థాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (70 నాటౌట్), హెట్మయర్ (42 నాటౌట్) లతో పాటు దేవదత్ పడిక్కల్ (37) రాణించారు. జైస్వాల్ (4) మరోసారి విఫలం కాగా... శాంసన్ (8) త్వరగానే ఔటయ్యాడు.
