TATA IPL 2022: వరుసగా నాలుగు ఓటములతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ముంబై ఇండియన్స్ నేడు  పంజాబ్ కింగ్స్ తో కీలక మ్యాచ్ ఆడుతున్నది.  ఈ సీజన్ లో  ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే రోహిత్ సేన ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలవాల్సిందే. 

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా బరిలోకి దిగి వరుస వైఫల్య ప్రదర్శనలతో పాయింట్ల పట్టికలో పాతాళానికి (పదో స్థానానికి) పడిపోయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో అత్యంత కీలక మ్యాచ్ ఆడనున్నది. సీజన్ లో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే ఆ జట్టుకు ఈ మ్యాచ్ లో గెలుపు ఎంతో అవసరం. ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచులు ఓడిన ఆ జట్టు నేడు పూణే వేదికగా పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ఆడుతున్నది. కీలక మ్యాచులో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్.. టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. 

ఐపీఎల్ లో ఇంతవరకు ట్రోఫీ నెగ్గని పంజాబ్ కింగ్స్ తో కీలక మ్యాచ్ ఆడనున్న ముంబై.. ఈ మ్యాచ్ లో గెలిచి తొలి విజయాన్ని అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. 2014లో వరుసగా ఐదు మ్యాచులు ఓడిన ముంబై ఇండియన్స్.. పంజాబ్ కింగ్స్ తో వాంఖెడే వేదికగా జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయంతో తిరిగి విజయాల బాట పట్టింది. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని ముంబై అభిమానులు భావిస్తున్నారు. 

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉంది ముంబై పరిస్థితి. జట్టంతా స్టార్లతో నిండి ఉన్నా ఆపదలో ఎవరూ ఆడటం లేదు. తొలి మ్యాచ్ ఢిల్లీతో మినహా టాపార్డర్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలు వరుసగా విఫలమవుతున్నారు. తొలి రెండు మ్యాచులలో బాగా ఆడిన తిలక్ వర్మ తర్వాత రెండు మ్యాచులలో చేతులెత్తేశాడు. కీరన్ పొలార్డ్ మెరుపులు మెరిపించడం లేదు. దీంతో జట్టు భారమంతా సూర్య కుమార్ యాదవ్ మీదే పడుతున్నది. గత రెండు మ్యాచులలో అతడు ఆడకుంటే ముంబై పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. 

బ్యాటింగ్ లో అంతో ఇంతో నెగ్గుకొస్తున్న ముంబై కి ప్రధాన సమస్య బౌలింగ్. ఒకప్పుడు భీకర బౌలర్లతో ప్రత్యర్థుల మీద పైచేయి సాధించిన ముంబైకి ఇప్పుడు అదే ప్రధాన సమస్యగా మారింది. బుమ్రా ఒక్కడు మినహా పేస్ బౌలర్లలో అందరూ తేలిపోతున్నారు. బాసిల్ తంపి కాస్త ఫర్వాలేదనిపించినా వికెట్లు మాత్రం తీయలేకపోతున్నాడు. స్పిన్నర్లలో మురుగన్ అశ్విన్ కాస్త బెటర్ గానే ఉన్నా అతడికి కూడా సహకారం అందించే నిఖార్సైన స్పిన్నర్ ముంబైకి లేడు. 

పంజాబ్ విషయానికొస్తే ఇప్పటివరకు ఆ జట్టు నాలుగు మ్యాచులు ఆడి రెండిట్లో గెలిచి రెండు ఓడింది. బౌలింగ్, బ్యాటింగ్ లో సమర్థవంతమైన ఆటగాళ్లు ఉన్న పంజాబ్.. దెబ్బతిన్న ముంబైని ఎలా ఎదుర్కుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరం. 

ఇరు జట్లు ఇప్పటివరకు 28 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై 15 సార్లు నెగ్గగా.. పంజాబ్ 13 మ్యాచుల్లో గెలిచింది. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత ఐదు మ్యాచులలో ముంబై 3 సార్లు.. పంజాబ్ రెండు సార్లు నెగ్గింది. 

ఇరు జట్లలో మార్పులు : ముంబై ఇండియన్స్ తరఫున గత మ్యాచులో ఆడిన రమన్దీప్ సింగ్ స్థానంలో టైల్ మిల్స్ ఆడనున్నాడు. పంజాబ్ జట్టులో మార్పులేమీ లేవు. గత మ్యాచులో జట్టుతోనే ఆడుతున్నది.

తుది జట్లు : 

ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, డేవాల్డ్ బ్రేవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ తంపి, జయదేవ్ ఉనద్కత్

పంజాబ్ కింగ్స్ : మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయర్ స్టో, లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసొ రబాడా, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్, వైభవ్ అరోరా