Asianet News TeluguAsianet News Telugu

IPL 2022: చెన్నై కథ మారలే.. మూడు ఓటముల తర్వాత ఆర్సీబీ కి తొలి విజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం

TATA IPL 2022: ఐపీఎల్ లో ప్లేఆఫ్ రేసులో వెనుకబడ్డ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు మూడు పరాజయాల తర్వాత తొలి విజయం అందుకుంది. చెన్నైతో తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో తొలుత బ్యాటర్లు ఆకట్టుకోగా.. తర్వాత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆర్సీబీకి విజయాన్ని అందించారు. 

TATA IPL 2022: RCB Beats CSK by 13 Runs
Author
India, First Published May 4, 2022, 11:06 PM IST | Last Updated May 4, 2022, 11:06 PM IST

వరుసగా మూడు ఓటముల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు ఓ విజయం దక్కింది.  ప్లేఆఫ్ రేసులో వెనుకబడ్డ ఆ జట్టు ఎట్టకేలకు గెలుపును అందుకుంది.  చెన్నై సూపర్ కింగ్స్ తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఓడి ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోయింది.  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 174 పరుగుల లక్ష్య ఛేదనలో సీఎస్కే..  నిర్ణీత 20 ఓవర్లలో  8 వికెట్ల నష్టానికి 160 పరుగులే చేయగలిగింది. ఫలితంగా 13 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది.  చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేలు రాణించినా  మిడిలారర్డర్ బ్యాటర్లు విఫలమవడంతో ఆ జట్టు మరో ఓటమి పాలైంది.

తాజా విజయంతో  పాయింట్ల పట్టికలో 11 మ్యాచులాడి 6 విజయాలు, 5 ఓటములతో 12 పాయింట్లతో   నాలుగో స్థానానికి చేరింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఐదో స్థానానికి నెట్టింది.  ఇక చెన్నై ఆడిన 10 మ్యాచుల్లో ఇది  ఏడో ఓటమి. 

భారీ లక్ష్య ఛేదనలో చెన్నై ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని అందిచారు. రుతురాజ్ గైక్వాడ్ (23 బంతుల్లో 28.. 3 ఫోర్లు, 1 సిక్సర్), డెవాన్ కాన్వే (37 బంతుల్లో 56.. 6ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్ కు 54 పరుగులు జోడించారు. షాబాజ్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన కాన్వే.. గత మ్యాచ్ లో ఫామ్ ను కొనసాగించాడు. 

మరో ఎండ్ లో గైక్వాడ్ కూడా ఐదో ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్ లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. ఆ తర్వాత హసరంగ వేసిన ఆరో ఓవర్లో వీరిద్దరూ చెరో సిక్సర్ బాదారు. కానీ షాబాజ్ వేసిన ఏడో ఓవర్లో గైక్వాడ్ ను  ప్రభుదేశాయ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గైక్వాడ్ స్థానంలో  వచ్చిన ఊతప్ప (1).. మూడు బంతులే ఆడి రనౌట్ అయ్యాడు. 

రెండో స్థానంలో వచ్చిన రాయుడు (10) కూడా మ్యాక్స్వెల్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఆదుకుంటాడనుకున్న మోయిన్ అలీ (27 బంతుల్లో 34.. 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా త్వరగానే నిష్క్రమించాడు. ఒకవైపు  వికెట్లు పడుతున్నా .. కాన్వే మాత్రం దూకుడుగా ఆడాడు. హసరంగ బౌలింగ్ లో సిక్సర్ కొట్టి.. నలభైలలోకి చేరిన  కాన్వే.. హర్షల్ పటేల్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ 14.1 ఓవర్లో హసరంగ బౌలింగ్ లోనే షాబాజ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

 

ఆ క్రమంలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (3) కూడా హర్షల్ పటేల్ బౌలింగ్ లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ధోని (2) తో జత కలిసిన మోయిన్ అలీ.. దూకుడుగా ఆడాడు. హసరంగ వేసిన 14 ఓవర్ ఆఖరి బంతికి సిక్సర్ కొట్టిన అలీ..హర్షల్ పటేల్ వేసిన 18వ ఓవర్లో తొలి బంతికి సిక్సర్ బాదాడు.  కానీ ఆ  తర్వాత బంతికి సిరాజ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికే  సాధించాల్సిన రన్ రేట్  కూడా భారీగా పెరిగిపోయింది. 

తొలుత భారీగా పరుగులిచ్చిన  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు.. 14 ఓవర్ నుంచి కట్టుదిట్టంగా బంతులు విసిరారు. 14 వ ఓవర్ నుంచి 18 వ ఓవర్ వరకు 33 పరుగులే వచ్చాయి. ఆఖరి 12 బంతుల్లో 33 పరుగులు అవసరం కాగా..  19 వ ఓవర్ తొలి బంతికి హెజిల్వుడ్.. ధోనిని ఔట్ చేశాడు. తర్వాత నాలుగు బంతుల్లో మూడు పరుగులే వచ్చాయి.  ఆ ఓవర్లో మొత్తంగా 8 పరుగుల వచ్చాయి. 

ఇక ఆఖరి ఓవర్లో హర్షల్ పటేల్ తొలి బంతికే సిక్సర్ ఇచ్చినా.. తర్వాత కట్టుదిట్టంగా బంతులు విసిరాడు. మహేశ్ తీక్షణ ఓ 6, 4 బాదాడు. అయినా చెన్నై విజయానికి ఆ బాదుడు సరిపోలేదు. ఆర్సీబీ బౌలర్లలో  హర్షల్ పటేల్ 3, గ్లెన్ మ్యాక్స్వెల్ రెండు వికెట్లు పడగొట్టారు. హసరంగ, హెజిల్వుడ్, షాబాజ్ కు ఒక వికెట్ దక్కింది. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.  బెంగళూరు బ్యాటింగ్ లో మహిపాల్ లోమ్రర్ (42), డుప్లెసిస్ (38), విరాట్ కోహ్లి (30) రాణించారు. కార్తీక్ (26 నాటౌట్) ఆఖర్లో దూకుడుగా ఆడాడు. 

సంక్షిప్త స్కోరు వివరాలు : 

- రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు : 173-8 
- చెన్నై సూపర్ కింగ్స్ : 160-8
- ఫలితం :  13 పరుగుల తేడాతో ఆర్సీబీ  గెలుపు 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios