TATA IPL 2022 - RCB vs KKR: లో స్కోరింగ్ గేమ్ లో ఆర్సీబీనే విజయం  వరించింది.  బెంగళూరు బౌలర్ల వలే కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన కేకేఆర్.. ఇన్నింగ్స్ ఆరంభంలో చూపించిన దూకుడును తర్వాత కొనసాగించలేకపోయింది.  మొదట్లో వికెట్లు కోల్పోయినా.. ఆర్సీబీ  మాత్రం ఆఖర్లో.... 

ఐపీఎల్-15 సీజన్ లో ఆర్సీబీకి రెండో మ్యాచులో తొలి విజయం దక్కింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో ఆర్సీబీ.. 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందు టాస్ గెలిచిన ఆర్సీబీకి బౌలర్లు రెచ్చిపోవడంతో కేకేఆర్ ను గట్టిగా దెబ్బకొట్టింది. వనిందు హసరంగ, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్ లు రెచ్చిపోవడంతో కోల్కతాను 128 పరరుగులకే కట్టడి చేసిన బెంగళూరు... విజయ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఛేదనలో ఆ జట్టు కూడా కేకేఆర్ మాదిరే తడబడినా మిడిలార్డర్ ఆదుకోవడంతో గట్టెక్కింది. కాగా గత మ్యాచులో దూకుడు ప్రదర్శించిన కోల్కతా.. బౌలింగ్ లో దాన్ని కొనసాగించినా బ్యాటింగ్ లో మాత్రం విఫలమై మూల్యం చెల్లించుకుంది. 

129 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు వచ్చిన బెంగళూరుకు ఇన్నింగ్స్ రెండో బంతికే షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్.. అనూజ్ రావత్ రెండు బంతులు ఎదుర్కుని డకౌట్ గా వెనుదిరిగాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో అతడు కీపర్ జాక్సన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

రావత్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లి రెండు ఫోర్లు కొట్టి ఉత్సాహంగానే కనిపించాడు. 7 బంతుల్లో 12 పరుగులు చేశాడు. డుప్లెసిస్ (5) తో కలిసి మరో చక్కటి ఇన్నింగ్స్ ఆడతారని ఆర్సీబీ అభిమానులు భావించారు. కానీ రెండు బంతుల వ్యవధిలో ఈ ఇద్దరూ పెవిలియన్ చేరారు. 

Scroll to load tweet…

రెండో ఓవర్లో.. డుప్లెసిస్ ను సౌథీ ఔట్ చేయగా ఆ తర్వాతి ఓవర్లో ఉమేశ్ యాదవ్ ఆర్సీబీని మళ్లీ దెబ్బ కొట్టాడు. మూడో ఓవర్లో తొలి బంతికి కోహ్లిని ఓ అద్భుత డెలివరీతో బోల్తా కొట్టాడు. దీంతో ఆర్సీబీ.. 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన డేవిడ్ విల్లీ (28 బంతుల్లో 18.. 3 ఫోర్లు), షెర్ఫేన్ రూథర్ఫర్డ్ (40 బంతుల్లో 28) తో కలిసి నాలుగో వికెట్ కు 45 పరుగులు జోడించారు. అయితే పదో ఓవర్లో సునీల్ నరైన్.. ఈ జోడీని విడదీశాడు. విల్లీ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన షాబాజ్ అహ్మద్.. (20 బంతుల్లో 27.. 3 సిక్సర్లు) లు ధాటిగా ఆడాడు. అయితే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడే క్రమంలో అతడు స్టంపౌట్ అయ్యాడు. 

షాబాజ్ ఔటయ్యాక మరో ఓవర్లోనే టిమ్ సౌథీ కేకేఆర్ జట్టులో ఆశలు కల్పించాడు. ఒకే ఓవర్లో రూథర్ఫర్డ్ తో పాటు హసరంగ (4) కూడా ఔట్ చేశాడు. ఈక్రమంలో కాస్త డ్రామా నడిచింది. అయితే దినేశ్ కార్తీక్ (7 బంతుల్లో 14.. 1 ఫోర్, 1 సిక్సర్).. హర్షల్ పటేల్ (6 బంతుల్లో 12.. రెండు ఫోర్లు) సాయంతో లాంఛనాన్ని పూర్తి చేశాడు. 

అంతకుముందు టాస్ ఓడిన కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లో తడబాటుకు గురైంది కేకేఆర్. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 18.5 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఆండ్రూ రసెల్ (18 బంతుల్లో 25) మినహా ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. రహానే (9), వెంకటేశ్ అయ్యర్ (10), శ్రేయస్ అయ్యర్ (13), నితీష్ రాణా (10), సునీల్ నరైన్ (12) సామ్ బిల్లింగ్స్ (14) లు దారుణంగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో వనిందు హసరంగకు 4 వికెట్లు దక్కగా.. ఆకాశ్ దీప్ కు 3 వికెట్లు, హర్షల్ పటేల్ కు రెండు, మహ్మద్ సిరాజ్ 1 వికెట్ దక్కించుకున్నారు.