TATA IPL 2022 - RCB vs RR : దుర్బేధ్యమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాన్ ను బెంగళూరు బౌలర్లు నిలువరించారు. ఆఖరి రెండు ఓవర్లలో మెరుపులు మినహా.. బ్యాటర్లు, హిట్టర్లు కలిగి రాజస్థాన్.. 20 ఓవర్లలో 169  పరుగులు మాత్రమే చేసింది.  ఇక ఈ మ్యాచులో  బెంగళూరు విజయం సాధించాలంటే.... 

గత మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు.. తాజాగా రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచులో కూడా భారీ హిట్టర్లున్న ఆ జట్టును భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. నిలకడగా బౌలింగ్ చేసి దుర్బేధ్యమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన రాజస్థాన్ ను నిలువరించారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు.. 3 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసింది. ముంబైతో జరిగిన మ్యాచులో 66 బంతుల్లోనే శతకంతో చెలరేగిన జోస్ బట్లర్ (47 బంతుల్లో 70 నాటౌట్.. 6 సిక్సర్లు).. 17వ ఓవర్ దాకా నెమ్మదిగా ఆడినా చివర్లో రెచ్చిపోయాడు. ఆఖర్లో హెట్మెయర్ కూడా చెలరేగి ఆడటంతో రాజస్థాన్ ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లు వికెట్లు తీయకపోయినా సమిష్టిగా రాణించారు. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ కు శుభారంభం దక్కలేదు. గత రెండు మ్యాచుల మాదిరిగానే ఈ మ్యాచ్ లో కూడా 4 పరుగులే చేసి ఔటయ్యాడు. అతడి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన దేవదత్ పడిక్కల్ (29 బంతుల్లో 37. 2 పోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి జోస్ బట్లర్.. స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. అడపా దడపా బౌండరీలు బాదినా తొలి పవర్ ప్లే లో ఆ జట్టు సాధించింది 35 పరుగులే. 

ఆకాశ్ దీప్ వేసిన ఏడో ఓవర్లో నాలుగో బంతికి బట్లర్ ఇచ్చిన క్యాచ్ ను విల్లే డ్రాప్ చేశాడు. లైఫ్ దొరికిన వెంటనే బట్లర్ తర్వాతి బంతిని సిక్సర్ గా తరలించాడు. ఆ తర్వాత ఓవర్లో విల్లే విసిరిన బంతిని పడిక్కల్ భారీ షాట్ బాదగా.. స్క్వేర్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ వదిలేశాడు. అదే ఓవర్లో చివరి బంతికి పడిక్కల్ సిక్సర్ కొట్టాడు. ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ జంటను హర్షల్ పటేల్ విడదీశాడు. అతడు వేసిన పదో ఓవర్లో ఆఖరి బంతికి భారీ షాట్ బాదిన పడిక్కల్.. కోహ్లి పట్టిన అద్భుత క్యాచ్ తో వెనుదిరిగాడు. దీంతో 70 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 

అనంతరం వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ (8) కూడా త్వరగానే ఔటయ్యాడు. హసరంగ వేసిన 12వ ఓవర్లో రెండో బంతికి సిక్సర్ బాదిన శాంసన్.. నాలుగో బంతికి అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. 

వరుసగా రెండు వికెట్లు పడ్డ అనంతరం క్రీజులోకి వచ్చిన హిట్టర్ హెట్మయర్ (31 బంతుల్లో 42.. 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రన్స్ తీయడానికి ఇబ్బంది పడ్డాడు. అదే సమయంలో బట్లర్ కూడా కాస్త నెమ్మదించాడు. పదో ఓవర్ నుంచి 16వ ఓవర్ దాకా రాజస్థాన్ 36 పరగులు మాత్రమే చేయగలిగింది.

అయితే చివర్లో హెట్మెయర్ బ్యాట్ తో మెరుపులు మెరిపించాడు. సిరాజ్ వేసిన 18వ ఓవర్లో సిక్సర్ బాది 11 పరుగులు సాధించిన రాజస్థాన్.. అతడే వేసిన 19వ ఓవర్లో 19 పరుగులు పిండుకుంది. ఓపెనర్ గా బరిలోకి దిగిన బట్లర్.. అదే ఓవర్లో సిక్సర్ కొట్టి 42 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆకాశ్ దీప్ వేసిన 20వ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. చివరి రెండు ఓవర్లలో రాజస్థాన్ 32 రన్స్ రాబట్టింది. 

బెంగళూరు బౌలర్లు సమిష్టిగా రాణించారు. హర్షల్ పటేల్ నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసుకున్నాడు. వనిందు హసరంగ 4 ఓవర్లు వేసి 32 పరగులిచ్చి వికెట్ తీశాడు. డేవిడ్ విల్లీ 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి వికెట్ తీశాడు. ఆకాశ్ దీప్.. నాలుగు ఓవర్లలో 44 పరగులిచ్చాడు. అందులో సగం చివరి ఓవర్లో ఇచ్చినవే.