TATA IPL 2022 - DC vs RR:గురువారం చెన్నై-ముంబైల మధ్య లో స్కోరింగ్ గేమ్ చూసిన ఐపీఎల్ అభిమానులు.. శుక్రవారం హై స్కోరింగ్  మజాను ఆస్వాదించారు. కొండంత లక్ష్య ఛేదనలో ఆఖరి  ఓవర్ వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడినా  గెలుపు రాజస్తాన్ నే వరించింది. 

ఐపీఎల్ లో గురువారం ముంబై-చెన్నై మధ్య జరిగిన లో స్కోరింగ్ గేమ్ లో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా వేచి చూసి అసలైన టీ20 మజాను ఆస్వాదించిన క్రికెట్ అభిమానులకు ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ కూడా అదే అనుభూతినిచ్చింది. ఫలితం సంగతి పక్కనబెడితే బౌండరీలు, సిక్సర్లతో వాంఖెడే హోరెత్తింది. ఇరు జట్ల బ్యాటర్లు పండుగ చేసుకున్న వేళ.. బౌలర్లకు పీడకలలు మిగిలాయి. ఢిల్లీ తో పోల్చి తే రాజస్తాన్ బౌలర్లు కాస్త తక్కువ పరుగులే ఇచ్చినా బాదడం మాత్రం సేమ్ టు సేమ్. ఐపీఎల్ అభిమానులకు అసలైన విందును పంచిన ఈ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్.. 15 పరుగులతో గెలిచింది. ఢిల్లీ పోరాడి ఓడింది. మొత్తానికి టీ20 అభిమానులకు మరో షడ్రుచుల భోజనం దొరికింది. తాజా గెలుపు (ఐదు విజయాలు) తో పాయింట్ల పట్టికలో రాజస్తాన్ అగ్రస్థానానికి చేరింది. ఆడిన 7 మ్యాచుల్లో ఢిల్లీకి ఇది నాలుగో ఓటమి. 

భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఇన్నింగ్స్ ధాటిగానే ఆరంభమైంది. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన పృథ్వీ షా (27 బంతుల్లో 37.. 5 ఫోర్లు, 1 సిక్సర్), డేవిడ్ వార్నర్ (14 బంతుల్లో 28.. 5 ఫోర్లు, 1 సిక్స్) తో కలిసి నాలుగో ఓవర్లలోనే ఢిల్లీ స్కోరును 35 పరుగులు దాటించాడు. ఇద్దరూ ఫోర్లతో చెలరేగినా ప్రసిద్ధ్ కృష్ణ ఐదో ఓవర్లో వార్నర్.. కీపర్ సంజూ శాంసన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ వెంటనే సర్ఫరాజ్ ఖాన్ (1) కూడా అశ్విన్ బౌలింగ్ లో ప్రసిద్ధ్ కు క్యాచ్ ఇచ్చాడు. 

వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ ఆత్మరక్షణ లో పడింది. షా తో జతకలిసిన ఢిల్లీ సారథి రిషభ్ పంత్.. (24 బంతుల్లో 44.. 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ముందు ఆచితూచి ఆడాడు. అయితే మరోవైపు షా మాత్రం.. మెక్ కాయ్ వేసిన 9వ ఓవర్లో 4, 6, కొట్టగా నాలుగు పరుగులు బైస్ రూపంలో వచ్చాయి. అదే ఓవర్లో నాలుగు, ఐదు బంతులను పంత్ బౌండరీలు దాటించాడు. మొత్తంగా ఢిల్లీ ఆ ఓవర్లో 26 పరుగులు పిండుకుంది. షా, పంత్ కలిసి మూడో వికెట్ కు 51 పరుగులు జోడించారు. 

బ్రేక్ ఇచ్చిన అశ్విన్.. 

ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ జోడీని అశ్విన్ విడదీశాడు. అతడు వేసిన పదో ఓవర్లో ఆఖరి బంతికి భారీ షాట్ ఆడబోయిన పృథ్వీ షా... ఎక్స్ ట్రా కవర్స్ వద్ద ఉన్న ట్రెంట్ బౌల్ట్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో హాఫ్ సెంచరీ భాగస్వామ్యానికి తెరపడింది. 

Scroll to load tweet…

షా నిష్క్రమించినా పంత్ రియాన్ పరాగ్ వేసిన 11 ఓవర్లో మెరుపులు మెరిపించాడు. ఆ ఓవర్లో 6, 1,1, 6, 4, 2తో మొత్తం 22 పరుగులొచ్చాయి. ఢిల్లీ కాస్త కుదురుకుంటున్న తరుణంలో.. 12వ ఓవర్ వేసిన ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్ లో పంత్ ఔటయ్యాడు. ఆ ఓవర్లో రెండో బంతికి పంత్ ఇచ్చిన క్యాచ్ ను చాహల్ జారవిడిచాడు. ఆ అవకాశాన్ని పంత్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తర్వాత బంతికే పడిక్కల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత ఢిల్లీ వరుసగా అక్షర్ పటేల్ (1), శార్దూల్ ఠాకూర్ (10) వికెట్లను కోల్పోయింది. 

వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత అప్పటికే క్రీజులో కొన్ని మెరుపులు మెరిపిస్తున్న లలిత్ యాదవ్ (24 బంతుల్లో 37.. 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కు జతకలిశాడు రొవ్మెన్ పావెల్ (15 బంతుల్లో 36.. 3 సిక్సర్లు). బౌల్ట్ వేసిన 18వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన అతడు ఢిల్లీకి ఆశలు కల్పించాడు. కానీ 19వ ఓవర్ వేసిన ప్రసిద్ధ్.. మూడో బంతికి లలిత్ యాదవ్ ను ఔట్ చేశాడు. 

ఆఖర్లో హైడ్రామా... 

Scroll to load tweet…

ఆఖరు ఓవర్లో ఢిల్లీకి 6 బంతుల్లో 36 పరుగులు కావాలి. క్రీజులో రొవ్మెన్ పావెల్, కుల్దీప్ యాదవ్. మెక్ కాయ్ చేతిలో బంతి. తొలి బంతి సిక్సర్. రెండు, మూడు బంతులకు అదే సీన్ రిపీట్. అయితే మూడో బంతి నోబాల్ అని ఢిల్లీ ఆరోపణ. ఈ సందర్భంగా మ్యాచ్ లో కాసేపు హైడ్రామా నడిచింది. అంపైర్ ఆ బంతిని నోబాల్ గా ఇవ్వలేదు. డగౌట్లో ఉన్న రిషభ్ పంత్.. కుల్దీప్, పావెల్ ను పెవిలియన్ కు రమ్మని సైగ చేశాడు. ఢిల్లీ జట్టుకు చెందిన ప్రవీణ్ ఆమ్రే ఏకంగా గ్రౌండ్ లోకి వచ్చి అంపైర్ తో చర్చించాడు. కానీ చివరికి అంపైర్లు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. కానీ ఢిల్లీ మాత్రం రిథమ్ కోల్పోయింది. ఫలితం.. తర్వాత మూడు బంతుల్లో పరుగులు రాలేదు. రాజస్తాన్.. 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ ప్రెజెంటేషన్ సందర్భంగా రిషభ్ పంత్ అంపైర్ల నిర్ణయంపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. బహుశా ఈ విషయమై ఢిల్లీ.. బీసీసీఐ కు కూడా ఫిర్యాదు చేసే అవకాశముంది. 

అంతకుముందు టాస్ ఓడిన రాజస్తాన్ రాయల్స్.. మరోసారి భారీ స్కోరు చేసింది. ఓపెనర్ గా వచ్చిన బట్లర్ 65 బంతుల్లోనే 116 పరుగులు సాధించాడు. అతడి సూపర్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 54.. 7 ఫోర్లు, 2 సిక్సర్లు) జతగా తొలి వికెట్ కు 155 పరుగులు జోడించాడు. అనంతరం సంజూ శాంసన్ కూడా చెలరేగి ఆడాడు. ఈ ముగ్గురి వీర విధ్వంసాలతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్.. 2 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

సంక్షిప్త స్కోర్లు : రాజస్తాన్ రాయల్స్ : 222-2 
ఢిల్లీ క్యాపిటల్స్ : 207-8 
ఫలితం : 15 పరుగుల తేడాతో రాజస్తాన్ విజయం