TATA IPL 2022 - MI vs PBKS: ఐపీఎల్ లో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బౌలర్లు మళ్లీ విఫలమయ్యారు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు వీరబాదుడు బాదుతుంటే వారికి అడ్డుకట్ట వేయాల్సింది పోయి...
ముంబై ఇండియన్స్ బౌలర్లు మరోసారి తేలిపోయారు. పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు వీరబాదుడు బాదుతుంటే అడ్డుకోవాల్సింది పోయి సమాధానం లేని ప్రేక్షకుల్లా మారిపోయారు. పంజాబ్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ లతో పాటు ఆఖర్లో జితేశ్ శర్మ మెరుపుల ముందు ముంబై బౌలర్లు తేలిపోయారు. తప్పక గెలవాల్సిన మ్యాచులో ఒళ్లు దగ్గర పెట్టుకుని బంతులు విసరాల్సింది పోయి వాళ్లు స్వేచ్ఛగా షాట్లు ఆడేలా ముంబై బౌలింగ్ సాగింది. ఒక్క బుమ్రా మినహా మిగిలినవారంతా భారీగా పరుగులిచ్చుకున్నారు. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్.. 5 వికెట్లకు 198 పరుగులు చేసింది. ఇక బ్యాటర్లమీదే ముంబై ఇండియన్స్ ఆశలన్నీ..
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్ కింగ్స్ కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (32 బంతుల్లో 52.. 6 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్ ధావన్ (50బంతుల్లో 70.. 5 ఫోర్లు, 3 సిక్సర్లు) శుభారంభం అందించారు. గత మూడు మ్యాచులలో విఫలమైన ఓపెనింగ్ జోడీ.. ఈ మ్యాచ్ లో మాత్రం రెచ్చిపోయి ఆడింది. మయాంక్, శిఖర్ ఇద్దరూ కలిసి చెలరేగి ఆడటంతో పంజాబ్ స్కోరు పవర్ ప్లేలో పరుగులు పెట్టింది.
మయాంక్.. ధావన్ ల జోరు..
బాసిల్ తంపి వేసిన తొలి ఓవర్లోనే మయాంక్ రెండు ఫోర్లు బాదాడు. ఉనద్కత్ వేసిన రెండో ఓవర్లో ధావన్ ఓ సిక్సర్ తో ఖాతా తెరిచాడు. బుమ్రా వేసిన మూడో ఓవర్లో 14 పరుగులొచ్చాయి. ఇదే జోరును కొనసాగించిన మయాంక్.. మురుగన్ అశ్విన్ వేసిన ఐదో ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. దీంతో ఐదో ఓవర్ ముగిసేసరికే పంజాబ్.. వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది.
దూకుడుగా ఆడిన మయాంక్.. టైమల్ మిల్స్ వేసిన 9వ ఓవర్లో లాంగాఫ్ మీదుగా సిక్సర్ బాది ఐపీఎల్-2022 లో తొలి హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. మరోవైపు ధావన్ కూడా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో మయాంక్.. మురుగన్ అశ్విన్ వేసిన తర్వాతి ఓవర్లో లాంగాఫ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 99 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
తొలి వికెట్ కోల్పోయాక పంజాబ్ స్కోరులో వేగం తగ్గింది. వన్ డౌన్ లో వచ్చిన బెయిర్ స్టో (13 బంతుల్లో 12) ఉనద్కత్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. అతడి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన లివింగ్ స్టన్ (2) కూడా బుమ్రా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 10 ఓవర్లకే వంద పరుగులు చేసిన పంజాబ్ తర్వాత ఆరు ఓవర్లలో 37 రన్స్ మాత్రమే చేసింది. స్కోరును పెంచే క్రమంలో తంపి వేసిన 17వ ఓవర్లో ఐదో బంతికి సిక్సర్ బాదిన ధావన్.. ఆఖరు బంతికి పొలార్డ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
జితేశ్ మెరుపులు :
ధావన్ ఔటయ్యాక ముంబై బలౌర్లను దంచే పని జితేశ్ శర్మ (15 బంతుల్లో 30 .. 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తీసుకున్నాడు. ఉనద్కత్ వేసిన 18వ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4, 6, 4 బాదాడు. ఆ ఓవర్లో 23 పరుగులు పిండుకున్నాడు. కానీ బుమ్రా వేసిన 19వ ఓవర్లో 8 పరుగులే వచ్చాయి. తంపి వేసిన ఆఖరి ఓవర్లో 16 పరుగులొచ్చాయి. దీంతో పంజాబ్ ఇన్నింగ్స్ 198 పరుగుల వద్ద ముగిసింది.
ముంబై బౌలర్లలో మిల్స్ తప్ప తంపి, ఉనద్కత్, బుమ్రా, అశ్విన్ లు తలో వికెట్ సాధించారు. తంపి, మిల్స్, ఉనద్కత్ లు భారీగా పరుగులిచ్చుకున్నారు.
