TATA IPL 2022 - MI vs PBKS: ఐదు సార్లు ఛాంపియన్  ముంబై ఇండియన్స్ కథ ఐపీఎల్-2022 లో మునిగినట్టే. టోర్నీలో ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే నిలిచి గెలవాల్సిన మ్యాచ్ లో  ఆ జట్టు మరోసారి ఓటమి పాలైంది. ఈ సీజన్ లో ముంబైకి ఇది వరుసగా ఐదో ఓటమి. 

ఐపీఎల్-2022 లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కు మరో ఓటమి తప్పలేదు. బౌలర్లు దారుణంగా విఫలమైన చోట బ్యాటర్లు కష్టపడ్డా ఆఖరి దాకా నిలవలేదు. కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లోతేంటో ప్రత్యర్థి జట్లకు చాటి చెప్పుతూ ఇన్నింగ్స్ సాగినా.. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో ముంబైకి వరుసగా ఐదో ఓటమి ఎదురైంది. పంజాబ్ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా పంజాబ్.. 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్ లో ముంబైకి ఇది వరుసగా ఐదో ఓటమి. పంజాబ్ కు ఐదింటిలో మూడో గెలుపు.

భారీ లక్ష్య ఛేదనలో ముంబైకి ఆశించిన ఆరంభమేమీ దక్కలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (17 బంతుల్లో 28.. 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నంతసేపు కాస్త మెరపులు మెరిపించాడే తప్ప వికెట్ కాపాడుకోలేదు. వైభవ్ ఆరోరా వేసిన తొలి ఓవర్లో ఫోర్, సిక్సర్ తో పరుగుల వేట ప్రారంభించిన రోహిత్.. రబాడా వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లు బాది టచ్ లోనే కనిపించాడు. 

అతడు వేసిన నాలుగో ఓవర్లో మూడో బంతికి సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో రోహిత్ టీ20లలో పదివేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. కానీ అదే ఓవర్లో నాలుగో బంతి రోహిత్ బ్యాట్ ఎడ్జ్ కు తాకి బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ వద్ద ఉన్న వైభవ్ కు చిక్కింది. ఆ తర్వాత ఓవర్లోనే వైబవ్ అరోరా.. ఇషాన్ కిషన్ (3) ను ఔట్ చేశాడు. దీంతో 31 పరగులకే ఓపెనర్లిద్దరూ ఔట్ అయ్యారు. అప్పుడొచ్చారు క్రీజులోకి ఇద్దరు కుర్రాళ్లు.. 

పంతొమ్మిదేండ్ల కుర్రాళ్లు.. పంజాబ్ ను ఆటాడించారు.. 

ఓపెనర్లిద్దరూ నిష్క్రమించిన తర్వాత పంజాబ్ కాస్త ఊపిరి పీల్చుకుంది. అప్పుడే క్రీజులోకి వచ్చిన బేబీ ఏబీడీ డేవాల్డ్ బ్రేవిస్ (25 బంతుల్లో 49.. 4 ఫోర్లు, 5 సిక్సర్లు), తిలక్ వర్మ (20 బంతుల్లో 36.. 3 ఫోర్లు, 2 సిక్సర్లు) లు ఉన్నది కాసేపే అయినా పంజాబ్ కు చుక్కలు చూపించారు. తొలుత కాస్త తడబడ్డ బ్రేవిస్.. రాహుల్ చాహర్ వేసిన 9వ ఓవర్లో విశ్వరూపం చూపాడు. 

Scroll to load tweet…

ఆ ఓవర్లో వరుసగా తిలక్ వర్మ తొలి బంతికి సింగిల్ తీసి బ్రేవిస్ కు స్ట్రైక్ ఇచ్చాడు. రెండో బంతి ఫోర్.. మూడు, నాలుగు ఐదు, ఆరు బంతులు స్టాండ్స్ లోకి వెళ్లాయి. నాలుగు సిక్సర్లు, ఓ ఫోర్ తో ఆ ఓవర్లో 29 పరుగులొచ్చాయి. వైభవ్ వేసిన పదో ఓవర్లో తిలక్ వర్మ.. ఫోర్, సిక్సర్ బాది తానూ ఏం తక్కువ తిన్లేదని నిరూపించాడు. దీంతో పదో ఓవర్లోనే ముంబై ఇండియన్స్ స్కోరు 100 పరుగులు దాటింది. తిలక్ వర్మ వయసు 19 ఏండ్లు కాగా జూనియర్ ఏబీడీ కి 18 సంవత్సరాలు. 

ఒడియన్ స్మిత్ వేసిన 11వ ఓవర్లో సిక్స్ కొట్టి బ్రేవిస్ కు స్ట్రైక్ ఇచ్చాడు తిలక్ వర్మ. ఆ ఓవర్లో ఐదో బంతికి ఫోర్ కొట్టిన బేబీ ఏబీడీ.. ఆఖరి బంతిని భారీ షాట్ ఆడబోయి స్క్వేర్ లెగ్ వద్ద ఉన్న అర్షదీప్ కు చిక్కాడు. దీంతో తుఫాన్ ఇన్నింగ్స్ కు తెరపడింది. బ్రేవిస్-తిలక్ లు మూడో వికెట్ కు 84 పరుగులు జోడించారు. బ్రేవిస్ నిష్క్రమించిన తర్వాత ఓవర్లోనే తిలక్ కూడా రనౌట్ అయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన పొలార్డ్ (10) కూడా రనౌట్ గా వెనుదిరిగాడు. ఇవే ముంబై కొంప ముంచాయి.

సూర్య.. ప్చ్..

పొలార్డ్ రనౌట్ అయ్యాక సూర్యకుమార్ యాదవ్ (30 బంతుల్లో 43.. 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. వైభవ్ అరోరా వేసిన 16వ ఓవర్లో (పొలార్డ్ ఈ ఓవర్ తొలి బంతికే రనౌట్ అయ్యాడు) వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. కానీ 18వ ఓవర్ వేసిన అర్షదీప్ 5 పరుగులే ఇచ్చాడు. దీంతో సమీకరణం 12 బంతుల్లో 28 పరుగులకు చేరింది. 19వ ఓవర్ వేసిన రబాడా ఓవర్లో తొలి బంతికే ఫోర్ కొట్టినా నాలుగో బంతికి లాంగాన్ లో ఒడియన్ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ఆఖరి ఓవర్లో ఓడియన్ స్మిత్.. 9 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసి ముంబైని ముంచాడు.