TATA IPL 2022 - LSG vs DC: భారత జట్టుకు భావి సారథులుగా భావిస్తున్న ఇద్దరు ఆటగాళ్లు రిషభ్ పంత్, కెఎల్ రాహుల్  లు ఐపీఎల్-15 సీజన్ లో తొలి సారి పోటీ పడనున్నారు.  ఈ మ్యాచులో ఢిల్లీ తరఫున  డేవిడ్ వార్నర్ తో పాటు... 

ఐపీఎల్-2022 లో భాగంగా డీవై పాటిల్ స్టేడియం ఆసక్తికర పోరుకు వేదికైంది. భావి భారత కెప్టెన్లుగా భావిస్తున్న ఇద్దరు యువ ఆటగాళ్లు (కెఎల్ రాహుల్, రిషభ్ పంత్).. ఐపీఎల్-15 సీజన్ లో మొదటిసారి ‘ఢీ’కొనబోతున్నారు. ఈ సీజన్ లో ఈ రెండు జట్లు పోటీ పడుతుండటం ఇదే తొలిసారి. గుజరాత్ తో జరిగిన తొలి మ్యాచ్ ఓడినా.. తర్వాత చెన్నై, హైదరాబాద్ ను ఓడించి వరుసగా రెండు విజయాలతో ఉన్నది లక్నో. కాగా తొలి మ్యాచ్ లో ముంబై ని ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్.. తమ రెండో మ్యాచ్ లో గుజరాత్ చేతిలో ఓడింది. కాగా నేటి మ్యాచులో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 

ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ఢిల్లీ మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నది. రిటెన్షన్ ప్రక్రియలో ఆ జట్టు దక్కించుకున్న దక్షిణాఫ్రికా పేసర్ ఆన్రిచ్ నోర్త్జ్ తో పాటు వేలంలో కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్, సర్పరాజ్ ఖాన్ లు ఈ మ్యాచ్ ఆడనున్నారు. ఇక లక్నో.. గత 3 మ్యాచుల్లో విఫలమైన మనీష్ పాండేను పక్కనబెట్టింది. అతడి స్థానంలో కృష్ణప్ప గౌతమ్ ఆడనున్నాడు. 

బలాబలాల పరంగా రెండు జట్లు సమానంగానే ఉన్నాయి. ఢిల్లీకి డేవిడ్ వార్నర్ రాకతో బ్యాటింగ్ బలం పెరిగింది. వార్నర్, పృథ్వీ షా, మన్దీప్ సింగ్, రిషభ్ పంత్, లలిత్ యాదవ్, రొమన్ పావెల్ తో పాటు ఆల్ రౌండర్లు శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ లతో బ్యాటింగ్ దుర్బేధ్యంగా ఉంది. అయితే గత 3 మ్యాచులలో పృథ్వీ షా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఢిల్లీ ఈ మ్యాచులో అతడు రాణించాలని ఆశిస్తున్నది. బౌలింగ్ లో ఆ జట్టులో నోర్త్జ్ చేరడంతో మరింత బలంగా తయారైంది. 

లక్నో విషయానికొస్తే.. కెఎల్ రాహుల్, డికాక్, ఎవిన్ లూయిస్ వంటి స్టార్ బ్యాటర్లతో పాటు దీపక్ హుడా, ఆయుష్ బదోని, జేసన్ హోల్డర్ వంటి హిట్టర్లతో దృఢంగా కనిపిస్తున్నది. బౌలింగ్ లో అవేశ్ ఖాన్ హైదరాబాద్ తో మ్యాచులో (4 వికెట్లు) ప్రదర్శన పునరావృతం చేయాలని ఆ జట్టు భావిస్తున్నది. కృనాల్ పాండ్యా తన స్పిన్ తో ఆకట్టుకుంటున్నాడు. డెత్ ఓవర్లలో జేసన్ హోల్డర్ మ్యాచ్ ను మలుపు తిప్పగల సమర్థుడు. 

తుది జట్లు : 

ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్ (కెప్టెన్), రొమన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మన్, ఆన్రిచ్ నోర్త్జ్ 

లక్నో సూపర్ జెయింట్స్ : కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జేసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్